మందు కొడితే మనిషి కాడంటారు. ఇతగాడు కూడా అలాంటోడే. తన పెళ్లి సందర్భంగా స్నేహితులకు దావత్ ఇచ్చిన ఓ వ్యక్తి, తను కూడా పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఏకంగా తన పెళ్లినే మరిచిపోయాడు. బిహార్ రాష్ట్రంలో జరిగింది ఈ వింత ఘటన.
భాగల్ పూర్ లోని సుల్తాన్ గంజ్ ప్రాంతంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ముందు రోజు నుంచే పెళ్లి తంతు కూడా మొదలైంది. వధూవరులిద్దరూ సిద్ధమయ్యారు. మరుసటి రోజు పెళ్లి. ఇంతలోనే పెళ్లికొడుకు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లతో సరదాగా గడిపేందుకు బయటకెళ్లాడు వరుడు.
అలా బయటకు వెళ్లడమే పెళ్లికొడుకు చేసిన తప్పు. ఫ్రెండ్స్ తో కలిసి కాస్త ఎక్కువగా మద్యం లాగించాడు. దీంతో అతడికి ఫుల్లుగా నిద్ర పట్టేసింది. ఎంతలా అంటే ఏకంగా తన పెళ్లి అనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. స్నేహితులు లేపినా లేవలేకపోయాడు. అలా దాదాపు 20 గంటలు మత్తులోనే గడిపేశాడు.
లేచి చూస్తే, పెళ్లి ముహూర్తం దాటిపోయింది. హుటాహుటిన పెళ్లికూతురు ఇంటికెళ్లాడు. అందరికీ సారీ చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాగుబోతు మొగుడు నాకొద్దంటూ పెళ్లికూతురు వివాహం రద్దు చేసుకుంది. అదే టైమ్ లో వధువు తల్లితండ్రులు, బంధువులు కొంతమంది పెళ్లికొడుకు బంధువుల్ని నిర్బంధించారు.
పెళ్లి కోసం చేసిన ఖర్చుతో పాటు కట్నం డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తానికి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తాగి పెళ్లి చేసుకోవడం మరిచిపోయిన వరుడ్ని చూసి పోలీసులు నవ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. పెళ్లి మాత్రం అవ్వలేదు. సెటిల్ మెంట్ మాత్రమే జరిగింది.