సంజ‌య్ రౌత్ కు తోడుగా ఉద్ధ‌వ్ ఠాక్రేనూ జైలుకు?

ఇప్ప‌టికే ఈడీ కేసుల‌తో జైల్లో ఉన్నారు శివ‌సేన ముఖ్య నేత సంజ‌య్ రౌత్. ఒక సొసైటీ అక్ర‌మాల కేసుల్లో శివ‌సేన ట్ర‌బుల్ షూట‌ర్ ను జైల్లోకి పంపారు. నెల‌లు గ‌డుస్తున్నా రౌత్ కు బెయిల్…

ఇప్ప‌టికే ఈడీ కేసుల‌తో జైల్లో ఉన్నారు శివ‌సేన ముఖ్య నేత సంజ‌య్ రౌత్. ఒక సొసైటీ అక్ర‌మాల కేసుల్లో శివ‌సేన ట్ర‌బుల్ షూట‌ర్ ను జైల్లోకి పంపారు. నెల‌లు గ‌డుస్తున్నా రౌత్ కు బెయిల్ మంజూరు కావ‌డం లేదు. మొద‌ట్లో రౌత్ పై మోపిన అభియోగాలు కోటి రూపాయ‌ల విలువైన‌వ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు రౌత్ విష‌యంలో వంద కోట్ల రూపాయ‌ల అభియోగాల‌ను ప్ర‌స్తావిస్తోంద‌ట ఈడీ. ఇటీవ‌ల ఆయ‌న బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు గాకా.. రౌత్ స్కామ్ విలువ వంద కోట్ల పైనే అని ఈడీ ప్ర‌స్తావించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

అరెస్టు స‌మ‌యంలో రౌత్ భార్య‌కు ముడుపులు ముట్టాయ‌ని, వాటి విలువ కోటి రూపాయ‌లు అనే టాక్ వ‌చ్చింది. ఇప్పుడు భిన్నంగా న‌డుస్తున్న‌ట్టుంది ఈ కేసు. ఆ సంగ‌త‌లా ఉంటే.. రౌత్ కు కోర్టు బెయిల్ నిరాక‌రించ‌గా, ఇంత‌లో శివ‌సేన అధిప‌తి ఉద్ధ‌వ్ ఠాక్రే పై సీబీఐ, ఈడీ విచార‌ణ‌కు ఆదేశించాల్సిందిగా బాంబే హైకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. ఉద్ధ‌వ్ ఠాక్రేపై అక్ర‌మాస్తుల కేసులు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టాలంటూ పిటిష‌న‌ర్ కోరారు.

ఇందుకు ఆధారాలు ఏమిటంటే… ఉద్ధ‌వ్ ఠాక్రేకు సంబంధించిన ప‌త్రిక‌లు లాభాల్లో న‌డ‌వ‌డాన్ని ఆధారంగా పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలో దేశంలో ప‌త్రికారంగం ఉక్కిరిబిక్కిరి అయ్యింద‌ని, తీవ్ర న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంద‌ని, అదే ఠాక్రే- శివ‌సేన‌కు సంబంధించిన ప‌త్రిక‌లు మాత్రం ప‌దుల కోట్ల రూపాయ‌ల లాభాల‌ను చూపాయంటూ స‌ద‌రు పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఆ పిటిష‌న‌ర్ కూడా ప‌బ్లిష‌ర‌నేట‌. క‌రోనా స‌మ‌యంలో వారి ప‌త్రిక కూడా తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొంద‌ట‌. అలాంటిది శివ‌సేన కు సంబంధించిన ప‌త్రిక‌లు ఎలా లాభాల‌ను సంపాదించాయంలూ పిటిష‌న‌ర్ అంటున్నారు.

ఠాక్రే కుటుంబం ఆ ప‌త్రిక‌ల‌ను ఉప‌యోగించి న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకుంద‌ని, కాబ‌ట్టి వారిపై సీబీఐ, ఈడీల విచార‌ణ సాగించాల‌ని పిటిష‌న‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. మ‌రి భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్య‌తిరేకుల‌పై సీబీఐ, ఈడీ రైడ్స్ సునాయాసం అయ్యాయి. ఇలాంటి నేప‌థ్యంలో… ఈ పిటిష‌న్ ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది, రౌత్ విడుద‌ల కాకుండానే.. ఠాక్రేను ఆయ‌న‌కు జత‌గా పంపే అవ‌కాశాలున్నాయా? అనేవి ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.