Advertisement

Advertisement


Home > Politics - National

హే రామ్.. హనుమంతుడి ముందు బికినీల్లో..!

హే రామ్.. హనుమంతుడి ముందు బికినీల్లో..!

మహిళా దినోత్సవం సందర్భంగా బాడీబిల్డింగ్ పోటీలు పెట్టారు. కండలు తిరిగిన మహిళలు, యువతులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద స్టేజ్ పై లేడీ బాడీ బిల్డర్లు తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. మగవారికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఔరా అనిపించారు. బికినీల్లో క్యాట్ వాక్ చేశారు. ఆహుతుల్లో ఆడ మగ అందరూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ విమర్శించాల్సిన అంశమేమీ లేదు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టడం తప్పేమీ కాదు. కానీ అక్కడే చిన్న చిక్కొచ్చింది. ఆ స్టేజ్ పై ఆంజనేయుడి కటౌట్ పెద్దది పెట్టారు. ఆంజనేయుడి బొమ్మ ముందే మహిళలు బికినీల్లో వచ్చి తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

సహజంగా ఇలాంటి తప్పులు కాంగ్రెస్ నాయకులు చేస్తే దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ జరిగేది. కానీ ఇక్కడ ఈ తప్పు చేసింది బీజేపీ నేతలు. మధ్యప్రదేశ్ లోని రత్లాం పట్టణంలో ఈ పోటీ జరిగింది. హనుమంతుడి బొమ్మ ముందే ఆడవాళ్లు అంగాంగ ప్రదర్శన చేయడమేంటనే విమర్శలు వినపడుతున్నాయి. బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరీ దారుణం అని విమర్శిస్తున్నారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా, రత్లాం మేయర్ ప్రహ్లాద్ పటేల్ ఈ పోటీలు నిర్వహించారని, ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

గంగాజలంతో శుద్ధి..

హనుమంతుడి కటౌట్ ముందు మహిళలు తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించడాన్ని తప్పుబడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ స్టేజ్ ని గంగాజలంతో శుద్ధి చేశారు. అక్కడ హనుమాన్ చాలీసా పఠించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. భోపాల్ సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇతర పార్టీలు ఇలా చేస్తే బీజేపీ రెచ్చిపోయి ఉండేది. ఇప్పుడు బీజేపీ నేతలే హనుమంతుడిని అవమానించినట్టయింది. దీంతో కాషాయదళం తేలుకుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉంది.

పఠాన్ సినిమాలో కాషాయ రంగు బికినీలో దీపిక అందాల ప్రదర్శన చేసిందంటూ ఇదే మధ్యప్రదేశ్ మంత్రి నానా హంగామా చేశారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో, అదే పార్టీ, ఏకంగా హనుమంతుడి ముందు మహిళలలో బికినీలు వేయించి బాడీ బిల్డింగ్ ప్రదర్శన చేయించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?