న్యూయార్క్‌లో గన్ పేలితే నూజివీడులో ఒక తల్లి భయపడుతుంది. ప్రపంచం చాలా చిన్నదైంది. అమెరికాలోని ప్రతి నగరంలో తెలుగువాళ్లున్నారు. అమెరికా అంటే డాలర్లు మాత్రమే కాదు, తుపాకులు కూడా.
తుపాకీకి జ్ఞానం వుండదు. పట్టుకున్న వాడి మాట వింటుంది. వాడికి మెదడు చెడిపోతే, గన్ సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. మొన్న టెక్సాస్‌లో చిన్న పిల్లల్ని, స్కూల్ టీచర్లని కాల్చేసిన వాడు మానసిక ఉన్మాది. నువ్వెంత తెలివైన వాడివైనా, నీ పక్కన ఒక ఉన్మాది వుంటే అంతా వృథానే.
అమెరికా ప్రత్యేకత ఏమంటే అక్కడ ఉన్మాదుల చేతుల్లోనే ఎక్కువ గన్స్ వున్నాయి. 18 ఏళ్లు దాటితే ఎవడైనా కొనుక్కోవచ్చు. ఒకప్పుడు వలసలు వస్తున్న వాళ్లకి భద్రత కోసం గన్ అవసరమైంది. తరువాత అది సంస్కృతిలో భాగమైంది. ఇపుడు వందల కోట్లు డాలర్ల వ్యాపారమైంది.
సంఘటనలు జరిగినపుడల్లా అధ్యక్షుడు విచారం ప్రకటించడం, తుపాకి చట్టాలను మార్చాలని పిలుపు ఇవ్వడం రొటీన్. తరువాత ఏమీ జరగదు. ఇంకోచోట కాల్పులు జరిగితే మళ్లీ సేమ్ సీన్.
అమెరికా బతుకుతున్నదే ఆయుధాల మీద. ప్రపంచంలోని అన్ని దేశాలకీ అమ్ముతుంది. ఇక్కడ ఆదానీలు, అంబానీలు వున్నట్టే అక్కడా ఆయుధ వ్యాపారులు వున్నారు. వాళ్ల లాబీ లేకుండా రాజకీయాలు జరగవు. ఆయుధ నియంత్రణ చట్టాన్ని వాళ్లు అడ్డుకుంటారు. డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరూ వాళ్ల మనుషులే. వ్యాపారంలో ప్రాణాలకి విలువ వుండదు.
హఠాత్తుగా శాంతి ఏర్పడితే దాని విలువ వందల కోట్లు, కొన్ని వేల ఉద్యోగాలు. ప్రపంచానికి ఎవరైనా మంచి చేయాలన్నా చేయలేని స్థితి. ఎందుకంటే నీ మంచి వల్ల వ్యాపారాలు మునిగిపోతాయి. ఒక సైంటిస్ట్ వచ్చి సుగర్‌కి మందు కనిపెట్టి, అది తింటే శాశ్వత నిర్మూలన అని చెబితే ఫార్మా కంపెనీలన్నీ వాన్ని కొట్టి చంపేస్తాయి. సుగర్ పేరుతో ప్రపంచమంతా కొన్ని లక్షల కోట్ల బిజినెస్.
అమెరికాలో గన్ పరిస్థితి కూడా ఇదే. 50 ఏళ్ల నుంచి తుపాకుల వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. పిచ్చోడి చేతిలో గన్ ఆ దేశపు హక్కు. మన పిల్లలకి ఆ దేశం వెళ్లడం ఒక స్టేటస్. అక్కడ గన్ పేలితే ఇక్కడ అమ్మానాన్నలకి నిద్ర పట్టదు. డాలర్ అంటే ఒక కల. కొన్నిసార్లు పీడకల.
జీఆర్ మహర్షి