అతడొక డెలివరీ ఏజెంట్. ఏదైనా ఆర్డర్ చేస్తే ఇంటికొచ్చి ఇచ్చి వెళ్తాడని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇంట్లో ఎవ్వరూ లేరని గ్రహిస్తే మాత్రం ఎంత అఘాయిత్యానికైనా తెగబడతాడు. కేరళకు చెందిన 28 ఏళ్ల డెలివరీ ఏజెంట్ నియాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా..?
త్రిసూర్ లోని ఇరంజలక్కూడ ప్రాంతంలో ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తుంటాడు నియాస్. ఆన్ లైన్ లో ఎవరైనా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తే, వాళ్ల ఇంటికెళ్లి ఐస్ క్రీమ్ డెలివరీ ఇచ్చి వస్తాడు. ఇలానే ఓ మహిళ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. డెలివరీ కోసం ఇంటికెళ్లిన నియాస్, సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అక్కడితో ఆగలేదు. ఈ విషయాన్ని ఆమె భర్త, కొడుక్కి చెబుతానని, పరువు మొత్తం బజారుకీడుస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన మహిళ, నియాస్ కు అడిగినంత ఇవ్వడం మొదలుపెట్టింది.
అలా బాధిత మహిళ నుంచి దశలవారీగా 90 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు నియాస్. అతడికి ఇవ్వడం కోసం ఆమె తన బంగారాన్ని అమ్మడంతో పాటు, భూమి పత్రాలు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
అయితే ఇక్కడితో నియాస్ ఆగలేదు. 90లక్షలు తీసుకున్నప్పటికీ ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం కొనసాగించాడు. దీంతో విసిగివేసారిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నియాస్ ను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన తర్వాత నియాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో కొట్టాయం జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేశాడు. దీంతోపాటు మరిన్ని మోసాలు అతడి ఖాతాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.