ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అక్కడి ఎమ్మెల్యేల జీతాల పెంపును కోరుతూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ అసెంబ్లీలో పాగా వేసిన వెంటనే, జీతాభత్యాల పెంపును కోరుతూ వచ్చింది. అప్పట్లోనే ఇది చర్చనీయాంశంగా నిలిచింది.
ఆమ్ ఆద్మీ పార్టీ.. అంటూ అధికారాన్ని చేపట్టిన వారు అధికారంలోకి రాగానే జీతం పెంచమంటూ కోరడం ఏమిటనే ఆశ్చర్యాలు కూడా వ్యక్తం అయ్యాయి. 2015 నుంచినే ఆప్ తరఫు నుంచి ఈ డిమాండ్ చేస్తూ వచ్చింది. మామూలుగా అయితే జీతాలు పెరగాలంటే ఎమ్మెల్యేలు తమ శాసనసభలోనే బిల్లు పెట్టి ఆమోదించగలరేమో. అయితే ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాల వ్యవహారం కేంద్రం చేతిలో చిక్కింది. దీంతో ఈ పెంపు లేటయ్యింది.
అయితే ఈ పెంపు మరీ భారీగా ఏమీ లేదు. పెంపు బాగానే ఉన్నా, మరీ భారీ జీతాలేవీ వారికి అందవు. ఇన్నాళ్లూ ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు 54 వేల రూపాయల జీతభత్యాలను పొందారు. ఇక నుంచి మాత్రం ఇది పెరగనుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని వారికి 90 వేల రూపాయల జీతాలతో ప్రపోజల్ రెడీ అయ్యింది.
తమకు 54 వేల జీతం చాలడం లేదని, తమ కుటుంబ పోషణకు ఆ డబ్బు చాలదని వారు వాదిస్తూ వచ్చారు. 2015 నుంచి వారు ఈ డిమాండ్ చేశారు. రెండోసారి ఆప్ అధికారంలోకి వచ్చాకా కూడా ఇదే డిమాండ్ పై వారి పోరాటం కొనసాగింది.
చివరకు ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది. ఈ జీతం పెరిగినప్పటికీ తమ జీతాలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పోలిస్తే తక్కువే అని ఆప్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
2011లో చివరిసారి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయట. అప్పట్లో 12000 రూపాయల వేతనం, ఆపై అలవెన్సులు కలిపి 54 వేల రూపాయలను జీతంగా నిర్ణయించారు. 11 యేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేలకు జీతం పెరిగింది. ఈ విషయంలో ఆప్ సుదీర్ఘ పోరాటమే చేసింది.