వెస్ట్ బెంగాల్ పేరు మారబోతున్నదా? తెలుగులో దీన్ని పశ్చిమ బెంగాల్ అంటారని తెలిసిందే కదా. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పేరును మార్చాలని అనుకున్నారు. బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడదీయాలని నిర్ణయించినప్పుడు ముస్లిములు అధికంగా ఉన్న పంజాబ్ ను, బెంగాల్ ను రెండు భాగాలు చేశారు. అలా రెండు ముక్కలు కలిసి పాకిస్తాన్ గా ఏర్పడింది. ఆ సమయంలో బెంగాల్ పశ్చిమ భాగాన్ని ఇండియాలో కలిపి తూర్పు బెంగాల్ ను పాకిస్థాన్ లో కలిపారు.
కొన్ని కారణాలతో తూర్పు బెంగాల్ లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుకు భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో 1971 లో భారత్ -పాకిస్తాన్ మధ్య భీకరంగా యుద్ధం జరిగింది. అప్పుడు ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె కనబరిచిన ధైర్య సాహసాల గురించి ఈనాటికీ చెప్పుకుంటారు.
ఆ యుద్ధంలో ఇండియా విజయం సాధించిన ఫలితంగా కొత్తగా బంగ్లా దేశ్ ఏర్పడింది. పాకిస్తాన్ కు పంజాబ్ మాత్రమే మిగిలింది. బ్రిటిష్ పాలకులు విడదీసినప్పటి పశ్చిమ బెంగాల్ పేరే నేటికీ కొనసాగుతుండటంపై మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి రాష్ట్రం పేరును పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
కేంద్రప్రభుత్వ అనుమతి లేనిదే రాష్ట్రాల పేర్లు, నగరాల పేర్లు మార్చకూడదు. పేరు మార్పు ప్రతిపాదన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి అందిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం పార్లమెంటులో చెప్పారు.
బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బంగ్లా అనే పేరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పేరు మార్పు ప్రతిపాదనను వ్యతిరేకించడానికి కేంద్రానికి కారణమేమి లేదు. కాబట్టి ఆమోదించే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో నగరాల పేర్ల మార్పు కోసం వచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదన్నారు. 2017 లో ఆంద్ర ప్రదేశ్ లోని రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు. వాస్తవానికి దాని అసలు పేరు అదే. బ్రిటిష్ పాలకులు రాజమండ్రిగా మార్చారు. ప్రభుత్వం పేరు మార్చినా అది రికార్డులకే పరిమితమైంది. ప్రజలు రాజమండ్రి అనే అంటున్నారు. 2018 లో జార్ఖండ్ లోని నగర్ ఒంటారి పట్టణం పేరును శ్రీ బంశిధర్ నగర్ గా మార్చారు. మధ్య ప్రదేశ్ లోని బిర్సింగ్ పూర్ పలి పట్టణం పేరును మా బిర్శిని ధామ్ గా మార్చారు.
యూపీలోని అహమదాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. 2021 లో మధ్యప్రదేశ్ లోని హొషింగాబాద్ నగర్ పేరును నర్మదాపురంగా మార్చారు. అదే రాష్ట్రంలోని బాబయ్ నగరం పేరును మఖన్ నగర్ గా మార్చారు. ఈ ఏడాది పంజాబ్ లోని శ్రీ హరిగోబిందాపూర్ నగరం పేరును శ్రీ హర్ గోబిందాపూర్ సాహిబ్ గా మార్చారు. ఇంకా కొన్ని పేరు మార్పు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బీజేపీ నాయకులు అదే పనిగా చెబుతున్నారు.