జాతీయ రాజకీయాలు అన్నప్పుడల్లా.. కేసీఆర్ ముందుగా బెంగళూరు వెళ్లి దేవేగౌడ, కుమారస్వామిలను కలుస్తారు. మరి వారు గనుక విలీనానికి ఒప్పుకుంటే.. కేసీఆర్ కు పెద్ద విజయమే అవుతుందది. అయితే.. ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి విలీనం చేయడం వల్ల వారికి ఒనగూరే లాభం నయాపైసా లేదు!
దాని వల్ల జేడీఎస్ ఉనికి కోల్పోవడమే తప్ప ఉపయోగం ఉండదు. సోలోగా పోటీ చేస్తే.. ఏ హంగో ఏర్పడితే బీజేపీతోనో, కాంగ్రెస్ తోనో చేతులు కలిపే అవకాశాలు జేడీఎస్ కు ఉండనే ఉంటాయి. కేసీఆర్ తో కలిస్తే లేని పోని తలనొప్పి ఆ తండ్రీకొడుకులు. ఇలా కాకుండా.. జేడీఎస్ తో కేసీఆర్ పార్టీ పొత్తు పెట్టుకుని కర్ణాటకలో రెండు మూడు సీట్లలో పోటీ చేసినా.. అదేమంత సీరియస్ మ్యాటర్ అనిపించుకోదు.
ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కేసీఆర్ పార్టీతో పొత్తు ఉండదంటూ కుమారస్వామి కుండబద్ధలు కొట్టాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీట్లు ఇచ్చి పోటీ చేయించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో పోటీ చేయాలనే ఆసక్తి కేసీఆర్ పార్టీకి లేనే లేదంటూ కూడా కుమారస్వామి తేల్చి చెప్పాడు.
కర్ణాటకలోని తెలుగు బెల్ట్ లలో కేసీఆర్ పార్టీ పోటీకి దిగవచ్చంటూ.. ఇలా జాతీయ పార్టీగా ఆ పార్టీ ముందుకుపోతుందంటూ విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇదంతా చిటికెల పందిరి వ్యవహారమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ సంగతెలా ఉన్నా.. జాతీయ రాజకీయాలు అన్నప్పుడల్లా కేసీఆర్ వెళ్లేది దేవేగౌడ, కుమారస్వామిల వద్దకే. వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు లేదంటున్నారు.
విలీనం సంగతెలా ఉన్నా.. పొత్తు ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలకు కుమారస్వామి మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో సీట్లు ఇచ్చేది లేదు కానీ.. జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీ 150 సీట్లలో పోటీ చేస్తే వాటిల్లో తమ మద్దతు కేసీఆర్ కే అంటూ కుమారస్వామి చెప్పుకొచ్చారు! కర్ణాటకలో మద్దతు ఇవ్వరట, పొత్తు లేదట, 150 సీట్లలో మాత్రం మద్దతట. ఇదీ కుమారస్వామి కథ.
అయితే కేసీఆర్ మద్దతు తమ పార్టీకి ఉందని.. దీని ద్వారా కర్ణాటకలోని తెలుగు బెల్ట్ లలో తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగవుతుందని, అదనంగా ఇరవై సీట్ల వరకూ నెగ్గుతామంటూ కుమారస్వామి చెప్పుకురావడం ఇంకో కామెడీ!