ప్రాణం నిలబెట్టిన పిజ్జా.. ఇదో విచిత్రమైన స్టోరీ

పిజ్జా అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి అదో వ్యసనం. పిజ్జా తినకపోతే పిచ్చిపట్టినట్టు అయిపోయేవారు కూడా కొందరు ఉంటారు, అలాంటి వారు ప్రతి రోజూ పిజ్జా ఆర్డర్ ఇస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి క్రిక్…

పిజ్జా అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి అదో వ్యసనం. పిజ్జా తినకపోతే పిచ్చిపట్టినట్టు అయిపోయేవారు కూడా కొందరు ఉంటారు, అలాంటి వారు ప్రతి రోజూ పిజ్జా ఆర్డర్ ఇస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి క్రిక్ అలెగ్జాండర్. అమెరికాలోని ఫ్లోరిడాలో మారియన్ కౌంటీ ప్రాంతంలో నివశించే క్రిక్ అలెగ్జాండర్ గత పదేళ్లుగా పిజ్జాకి బానిస. ప్రతిరోజూ తన ఇంటికి సమీపంలోని డోమినోస్ పిజ్జా సెంటర్ కి ఫోన్ చేసి పార్శిల్ తెప్పించుకునేవాడు. ఏడేళ్లుగా ఒక్క రోజు కూడా అతను పిజ్జా మిస్ అవ్వలేదు. ఈ పిజ్జా పిచ్చి గురించే ఈ కథనం అనుకోవద్దు. ఈ పిజ్జా పిచ్చి వల్లే అతను బ్రతికి బయటపడ్డాడు. అదే ఇక్కడ గొప్ప విశేషం.

ప్రతి రోజూ పిజ్జా ఆర్డర్ ఇచ్చే రెగ్యులర్ కస్టమర్ వారం రోజులుగా పిజ్జా ఆర్డర్ ఇవ్వకపోవడంతో మారియన్ కౌంటీలోని డోమినోస్ బ్రాంచ్ వారికి అనుమానం వచ్చింది. తమ రెగ్యులర్ కస్టమర్ కి ఏమైందో ఏమోనని తెలుసుకోడానికి పిజ్జా డెలివరీ ఉమన్ అలెగ్జాండర్ ఇంటికెళ్లింది.

తలుగు లోపల గడియ పెట్టి ఉంది. లోపల టీవీ ఆన్ చేసి ఉంది, లైట్స్ వెలుగుతున్నాయి, పిలిస్తే ఎవరూ పలకడం లేదు. దీంతో అనుమానం వచ్చిన ఆవిడ, కిటికీ నుంచి తొంగి చూశారు. లోపల అలెగ్జాండర్ కిందపడిపోయి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పారా మెడికల్ సిబ్బందితో సహా వచ్చిన పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అలెగ్జాండర్ ని కాపాడారు.

గుండెపోటుతో కుప్పకూలిపోయి, వైద్యసాయం లేక విలవిల్లాడిపోతున్న అలెగ్జాండర్, పిజ్జా డెలివరీ ఉమన్ వల్ల బతికి బయటపడ్డారు. ఏడేళ్లుగా ప్రతిరోజూ పిజ్జా ఆర్డర్ చేసే అలవాటే అతడిని కాపాడిందని అంటున్నారు డోమినోస్ సిబ్బంది.

అలెగ్జాండర్ కి గత కొన్నిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు. అనారోగ్యం కారణంగా అతనికి పిజ్జా తినాలనిపించలేదు, అందుకే ఆర్డర్ ఇవ్వలేదు. 1-2 రోజుల తర్వాత అయినా పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి అలెగ్జాండర్ నుంచి ఫోన్ వస్తుందని అనుకున్నా రాలేదు. వారం రోజుల తర్వాత ఆయన ఇంటికెళ్లారు డోమినోస్ సిబ్బంది. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న అలెగ్జాండర్ నేలపై పడిపోయి అచేతన స్థితిలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి డోమినోస్ సిబ్బంది రావడం, పోలీసులకు ఫోన్ చేయడం, సకాలంలో వైద్యసేవలు అందడంతో పిజ్జా ప్రేమికుడు బతికి బయటపడ్డాడు.