ఈ ఏడాది టెక్ రంగానికి బొత్తిగా కలిసిరాలేదు. జనవరి నుంచి లే-ఆఫ్స్ నడుస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రతి పెద్ద కంపెనీలో ఉద్యోగుల తొలిగింపు సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగా 10వేల ఉద్యోగాల్ని తొలిగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇలా పూర్తయిందో లేదో అంతలోనే 'సెకెండ్ రౌండ్' మొదలుకాబోతున్నట్టు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
అవును.. మైక్రోసాఫ్ట్ లో రెండో దశ లేఆఫ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కంపెనీలో కొంతమంది అనధికారికంగా ధృవీకరిస్తున్నారు. నాన్-ప్రొడక్టివ్ (ఉత్పాదన అంతగా లేని) సెగ్మెంట్ల నుంచి ఉద్యోగాల్ని తొలిగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు.
అయితే జనవరిలో ప్రకటించినట్టుగా ఇది భారీ స్థాయి ఉద్వాసన కార్యక్రమం కాదు. అటుఇటుగా 250 నుంచి 350 మంది ఉద్యోగుల్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ వర్గాలు ప్రకటించాయి. మరీ ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న కంపెనీల నుంచే ఈ తొలిగింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
జనవరి నాటి ప్రకటనతో మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల సంఖ్యను 5శాతం కుదించుకుంది. తాజా తొలిగింపు ప్రక్రియ కంపెనీపై పెద్దగా ప్రభావం చూపించదు. అయితే ఓవైపు కొన్ని సెగ్మెంట్ల నుంచి ఉద్యోగుల్ని తొలిగిస్తున్నప్పటికీ, మరికొన్ని కీలకమైన సెగ్మెంట్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ప్రాధాన్యతా రంగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే అమెజాన్, గూగుల్, మెటా, ఇంటెల్ లాంటి ఎన్నో కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రెండో రౌండ్ మొదలుపెట్టింది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా స్వల్ప సంఖ్యలో ఉద్యోగుల్ని తొలిగించే ప్రక్రియలు మళ్లీ మొదలుపెట్టొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.