భారతదేశం స్వతంత్రం పొంది 75 యేళ్లను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని మోడీ పిలుపును ఇచ్చారు. ఈ క్రమంలో సామాన్యుల్లో దేశభక్తి పొంగిపొర్లుతోంది. జాతీయవాద భావనలు ఉన్న నెటిజన్లు తమ ప్రొఫైల్ పిక్ స్థానంలో జాతీయ జెండాను పెడుతున్నారు.
ఆగస్టు ఒకటి నుంచి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొమ్మన్న మోడీ పిలుపుకు అనుగుణంగానో, స్వతంత్రదినోత్సవం ఉన్న నెల కావడంతోనూ.. చాలా మంది నెటిజన్లు ప్రొఫైల్ పిక్స్ ను మార్చేస్తున్నారు. గతంలో డిజిటల్ ఇండియా అంటూ ఫేస్ బుక్ వాడు ఇచ్చిన పిలుపు మేరకు తమ ప్రొఫైల్ పిక్ కు త్రివర్ణాల టచ్ ను ఇచ్చారు చాలా మంది నెటిజన్లు.
దాదాపు ఏడెనిమిదేళ్ల కిందట ఇలా జరిగింది. డిజిటల్ ఇండియాను సపోర్ట్ చేయడమంటూ ఫేస్ బుక్ ఇచ్చిన పిలుపు అది. అదేదో ఉద్యమం అనుకున్నట్టుగా చాలా మంది అప్పట్లో జాతీయ జెండా రంగులను తమ ఫేస్ బుక్ ఫొటోలకు అద్దారు. ఆ తర్వాత అది ఫేస్ బుక్ పిలుపు అనే క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు మోడీ పిలుపుకు అనుగుణంగా కొంతమంది స్పందిస్తున్నారు. మరింతో మంది స్పందించాల్సి ఉంది. మరోవైపు సెలబ్రిటీల్లో కూడా ఈ కదలిక కనిపిస్తూ ఉంది. మోడీ పిలుపుకు అనుగుణంగా మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ తన ప్రొఫైల్ పిక్ స్థానంలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాడు.
ఇలా మోడీ పిలుపుపై స్పందన వస్తోంది. ఆగస్టు పదిహేను నాటికి.. మోడీ పిలుపుకు ఉన్న పవరేంటో మరింతగా తెలిసే అవకాశం ఉంది. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే యువతరం పై మోడీకి ఉన్న పట్టెంతో కూడా ఈ సందర్భంగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.