టార్గెట్ ఇం.డి.యా. : మోడీ మైండ్ గేమ్!

కాంగ్రెస్ సారథ్యంలో మోడీ వ్యతిరేక పార్టీలు అనేకం కలిసి ఒక కోట మీద ఏర్పడడం మాత్రమే ప్రస్తుతానికి జరిగింది. వీరందరూ కలకాలం ఐక్యంగానే ఉంటారా.. ఎలాంటి లుకలకలు లేకుండా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతుందా..…

కాంగ్రెస్ సారథ్యంలో మోడీ వ్యతిరేక పార్టీలు అనేకం కలిసి ఒక కోట మీద ఏర్పడడం మాత్రమే ప్రస్తుతానికి జరిగింది. వీరందరూ కలకాలం ఐక్యంగానే ఉంటారా.. ఎలాంటి లుకలకలు లేకుండా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతుందా.. అనే ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి. 

పదవులు సీట్లు వాటాలు వంటి వ్యవహారాలు చర్చకి వచ్చే సమయానికి.. వీరి మధ్య విభేదాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అయితే ఇం.డి.యా. కూటమిలోని విభేదాలు వాటంతట అవి బయటపడేదాకా నిరీక్షించే ఓపిక ప్రధాని నరేంద్ర మోడీకి లేనట్లుగా ఉంది. అర్జెంటుగా వారి మధ్య పొరపొచ్చాలు  క్రియేట్ చేయడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తన ముద్ర గల మైండ్ గేమ్ ప్రారంభించారు. 

సీనియర్ నాయకుడు ఇం.డి.యా. కూటమిలో ఒక కీలక సారథి అయిన శరద్ పవార్.. ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండాల్సిందంటూ ఆయన కొనియాడారు. అదే క్రమంలో.. నెహ్రూ ఇందిరా కుటుంబం యొక్క వారసత్వ రాజకీయాల ఫలితంగానే పవార్ కు అవకాశం దక్కలేదని ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ఈ రకంగా పవర్ సాగించడం ద్వారా .. ఇండియా కూటమిలో లుకలుకలకు  అసంతృప్తులకు మోడీ బీజం వేస్తున్నట్లుగా ఉంది.

మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం అయిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ భేటీలో ప్రతిపక్ష నాయకులను కొనియాడడం విశేషం. కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని మోడీ విమర్శించారు. ఆ పార్టీ మొత్తం వారసత్వ కుటుంబ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుందని నిందించారు. 

అందుచేతనే విపక్షంలో ఎందరో ప్రతిభావంతులైన నాయకులు ఉన్నప్పటికీ వారు ఎవ్వరికీ ప్రధాని కాగల అవకాశం దక్కలేదని తనదైన భాష్యం చెప్పారు. మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్, పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రణబ్ ముఖర్జీ లాంటి గొప్ప నాయకులకు.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యొక్క స్వార్థం వలన అవకాశాలు దక్కలేదని విమర్శించారు.

కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత శరద్ పవార్ ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముక్కలుచెక్కలుగా మారింది. ఆ పార్టీ ని రెండు ముక్కలుగా చీల్చి మహారాష్ట్రలో తమ ప్రభుత్వం లో కలిపేసుకుంది భాజపా. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పవార్‌ను కీర్తించడం గమనార్హం. ఇలాంటి మైండ్ గేమ్ తో మోడీ ఏదైనా కొత్త ఎత్తుగడ వేస్తున్నారా అనే అనుమానం పలువురికి కలుగుతోంది.