రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపాదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 'ది 2023 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్' లిస్ట్‌లో $82 బిలియన్ల నికర విలువతో భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ముకేశ్‌కు మాత్రమే చోటు దక్కింది.
గత ఏడాదితో పోల్చితే ముకేశ్ సంపద 20 శాతం క్షీణించినప్పటికి… గత కొన్ని నెలలుగా గౌతమ్ అదానీ సంపాదన భారీగా క్షీణించడం వల్ల రిలయన్స్ అధినేత నెంబర్ 1కు వచ్చారు. కాగా 53 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ నేపథ్యంలో అదానీ సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన విషయం తెలిసిందే.
గతేడాది జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ సంపాదన దాదాపు 130 బిలియన్ డాలర్లు. అయితే ఇప్పుడు అతని సంపాదన దాదాపు $53 బిలియన్లకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ రిపోర్టునిచ్చినప్పటి నుండి సగటున వారానికి రూ.3,000 కోట్లు నష్టపోయినట్టు తేలుస్తోంది.
కాగా దేశంలోని మొత్తం బిలియనీర్ల పరంగా 2023 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో చైనా మొదటి స్ధానంలో ఉండగా.. భారత్ మూడవ స్థానంలో ఉంది. భారత్ లో నివసిస్తున్న బిలియనీర్లు గత ఏడాది 215 నుండి 2023 నాటికి 187కి స్వల్పంగా పడిపోయారు. అయితే భారతీయ సంతతి వ్యక్తులను కలిపితే బిలియనీర్ల సంఖ్య 217కు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. కాగా ముంబైలో 66 మంది బిలియనీర్లకు నిలయం కాగా, న్యూఢిల్లీలో 39 మంది, బెంగళూరులో 21 మంది ఉన్నారు.