Advertisement

Advertisement


Home > Politics - National

ఆయన మోడీ.. మాటల్ని ఎలాగైనా వాడగలరు?

ఆయన మోడీ.. మాటల్ని ఎలాగైనా వాడగలరు?

ఆధునిక రాజకీయ నాయకులలో మాటల మాంత్రికుడు ఎవరైనా ఉన్నారంటే వారి వరుసలో ప్రధాని నరేంద్రమోడీ పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఒక జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ వెల్లడించిన విషయాలను గమనిస్తే ఎవ్వరికైనా సరే.. ఇలాగే అనిపిస్తుంది.

భారతీయ జనతా పార్టీ పరువును దేశవ్యాప్తంగా తీసిపారేసిన అనేక విషయాల్లో గానీ, మోడీ సర్కారు మళ్లీ ఏర్పడితే దేశం ఏమైపోతుందో అని భయపడుతున్న అనేక అంశాల్లో గానీ.. మోడీ చాలా తెలివిగా చాకచక్యంగా వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఎలక్టోరల్ బాండ్లు అనేవి ఇప్పుడు రద్దయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల రూపేణా జరుగుతున్న రాజకీయ అవినీతి బాగోతాలు బయటకు వచ్చాయి. ఈ విధానం రద్దు అయింది కూడా. అయితే నరేంద్రమోడీ మాత్రం.. ఎన్నికల బాండ్ల విధానం గురించి నిజాయితీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతి ఒక్కరూ బాధపడతారని వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు ఈ పద్ధతి ద్వారా స్పష్టమైన మార్గం ఏర్పడిందని అనడం మాత్రమే కాదు, నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసులో వచ్చిన స్వచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లు అని ప్రధాని మోడీ సమర్థించుకోవడం ఆయనకు మాత్రమే చెల్లిన విద్య.

ఎన్నికల బాండ్ల ద్వారా ‘వైట్’ రూపంలోనే రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఉండొచ్చు గాక.. కానీ.. వారు విధిగా ప్రతి ఏటా తమ పార్టీ ఎంతమంది దాతల నుంచి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎన్నికలబాండ్ల రూపేణా సేకరించిందో బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేసే ఏర్పాటును మోడీ తెచ్చి ఉంటే ఆయన ఇలాంటి నిజాయితీ కబుర్లు చెప్పడంలో అర్థముంది.

వేల కోట్ల రూపాయలు అధికారంలో ఉన్న భాజపాకు మాత్రమే జమ అవుతుండగా, అఖిలేశ్ యాదవ్ లాంటి నాయకులు ఇచ్చిన వాళ్లు ఎవరో తమకు తెలియదని, తమ పార్టీ ఆఫీసుకు అడ్రసులేని కవరులో వచ్చాయని కామెడీ చేసిన ప్రకటనలను గమనిస్తే ఇదంతా పచ్చి రాజకీయ అవినీతి బాగోతానికి దారితీసిన ఏర్పాటు అని ప్రజలకు తెలిసిపోతుంది. కానీ మోడీ దానిని చక్కగా సమర్థించుకుంటున్నారు.

అలాగే మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారా? అనే ప్రశ్నకు కూడా మోడీ సూటిగా జవాబివ్వడం లేదు. దేశ భవిష్యత్తు గురించి నా వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయి. వదంతులు నమ్మవద్దు. దేశ సంపూర్ణ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారే తప్ప అవేమిటో మోడీ చెప్పడం లేదు. రాజ్యాంగంలో సమూల మార్పులు ఉంటాయో లేదో ముడి విప్పడం లేదు. అందుకే ఆయన మోడీ అయ్యారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?