ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏదైనా ఉన్నదా అంటే అది ఎదుటివారికి సలహా చెప్పడం మాత్రమే అట. అలాగే అన్నింటికంటే కష్టమైన పని ఏదైనా ఉన్నదా అంటే.. అది చెప్పిన సలహాలు తాము స్వయంగా ఆచరించడమేనట.. పెద్దలు సరదాగా ఈ మాటలు చెబుతుంటారు. ఎవరైనా అడిగినా అడగకపోయినా సలహాలు చెప్పే పెద్ద మనుషులను చూస్తే ఈ మాటలు గుర్తుకు వస్తుంటాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఉపదేశాలను చూసినప్పుడు కూడా అవే గుర్తుకు వస్తున్నాయి.
దసరా సందర్భంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి భయంగా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి ప్రస్తావిస్తూనే ఇంకా ప్రజలకు అనేక నీతులు చెప్పారు.
దేశంలోని ప్రతి ఒక్కరూ, ఒక పేద కుటుంబం సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు పది ప్రతిజ్ఞలు తీసుకోవాలనేది ఈ దసరా సందర్భంగా మోడీ ఇచ్చిన పిలుపు. ఆ పది ప్రతిజ్ఞలు ఏమిటంటే.. నీటి పొదుపు, డిజిటల్ లావాదేవీలు, స్వచ్ఛత పాటించడం, ఒకల్ ఫర్ లోకల్, పనిలో నాణ్యత, దేశీయ పర్యాటకం, ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల వినియోగం, ఫిట్నెస్ అంశాలను ప్రోత్సహించాలని అన్నారు.
ఉపదేశం చేయడం బాగానే ఉంది.. కానీ ఈ పది ప్రతిజ్ఞల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? వీటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏమిటి. అంటే నోరు వెళ్ళవలసిన పరిస్థితి!
నీటిని పొదుపు చేయమంటున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా కనీసం తాగునీటి సరఫరా చేసే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా? క్రమం తప్పకుండా తాగునీరు వస్తుందని తెలిస్తే నిల్వవించుకొని వృధా చేసే వాతావరణం ఇళ్లలో ఉండదు కదా. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమీ చేయలేవు.
డిజిటల్ లావాదేవీలు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కానీ, డిజిటల్ లావాదేవీలకు రుసుములు విధించకుండా, ఆ లావాదేవీల పై ప్రజలలో విముఖత పుట్టకుండా బ్యాంకులను నియంత్రించడం మోడీ సర్కారుకు చేతనవుతుందా? అయితే మాత్రమే ఈ ఉపదేశం చేయాలి.
దేశీయ పర్యాటకం గురించి చెబుతున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మన స్వదేశంలో ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో తెలుసుకోకుండానే.. లక్షలకు లక్షలు తగలేసి విదేశీ యాత్రలను చేసేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. దేశీయ పర్యాటకం పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అయితే అందుకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటి. టూరిజం ప్రాజెక్టులు పెట్టే వారికి కోట్ల రూపాయల సబ్సిడీలు, వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు దోచిపెట్టడం కాదు. దేశీయ పర్యాటకాన్ని పెంచి పోషించే మామూలు ప్రజలకు అక్కడ ఎలాంటి అదనపు వెసులుబాటు ఇస్తున్నారు.
దేశంలోని అన్ని ప్రక్షాత టూరిజం ప్రాంతాలకు సరైన రోడ్డు సదుపాయం ఉన్నదా? ఆయా టూరిజం స్థలాలలో కనీసం పార్కింగ్ లాంటివైనా ఉచితంగా ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అంటే లేదు. అలాగే ప్రకృతి వ్యవసాయం అంటున్న మోడీ ఆ రంగానికి ఇస్తున్న సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఎంత అనేది తనకు తాను సమీక్షించుకోవాలి. చిరుధాన్యాలను తినమనడం బాగుంది. కానీ చిరుధాన్యాల ధరలను అదుపులోకి తీసుకురావడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన తెలుసుకోవాలి.
ఫిట్నెస్ ఉపదేశం చేస్తున్న ఈ యోగా గురువు మోడీ.. ఫిట్నెస్ పై యుక్త వయస్సులోనే అందరికీ ఆసక్తి, ఇష్టం పెరిగేలా.. అలవాటు అయ్యేలా డిగ్రీ కాలేజీలలో జిమ్ లాంటివి ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది చూడాలి. ప్రభుత్వపరంగా ఏమీ చేయకుండా ప్రజలకు చేసే ఉపదేశాలు దండగ అని తెలుసుకోవాలి.
ప్రతి సంపన్నులు ఒక పేద కుటుంబం ఆర్థిక సామాజిక స్థితిని మెరుగు పరచాలని అంటున్న నరేంద్ర మోడీ.. ఆ సంపన్న కుటుంబానికి ఎలాంటి ఆదాయ పన్ను మినహాయింపులు ఇస్తారు.. అనేది ముందుగా చెప్పాలి. తమ బాధ్యత నిర్వర్తించకుండా ప్రజలకు సుద్దులు చెప్పడం ఎవరైనా చేస్తారు. తాను భిన్నమైన ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ నిరూపించుకోవాలి.