నెహ్రూ తర్వాత అంతటి మొనగాడు మోడీనే!

భారతదేశ రాజకీయ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టి వరుసగా మూడుసార్లు ఎన్నికలలో విజయం సాధించి ప్రధాని పదవిని స్వీకరించిన వారు ఇప్పటిదాకా దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తప్ప మరొకరు లేరు. ఇప్పుడు ప్రధాని…

భారతదేశ రాజకీయ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టి వరుసగా మూడుసార్లు ఎన్నికలలో విజయం సాధించి ప్రధాని పదవిని స్వీకరించిన వారు ఇప్పటిదాకా దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తప్ప మరొకరు లేరు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సదరు నెహ్రూ రికార్డును సమం చేశారు. నెహ్రూ తర్వాత ఈ దేశంలో హ్యాట్రిక్  ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డు పుటల్లోకి ఎక్కారు!

దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొత్తం 16 సంవత్సరాల 282 రోజులపాటు ప్రధాని పదవిలో ఉన్నారు. ప్రధాని పదవిలో ఉండగానే మరణించారు. ఆ తర్వాత ఎవరు వరుసగా మూడుసార్లు ప్రధాని అయినవారు లేరు. ఆ ఘనత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతోంది.

మోడీ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి.. కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించడానికి ప్రతి దశలోనూ తన శక్తి వంచన లేకుండా కృషిచేస్తూనే వస్తున్నారు. పదేళ్లపాటు తాను  ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా.. నెహ్రూ కాలంలో చేసిన తప్పిదాల వలన జరిగిన నష్టాలు ఇంకా ఈ దేశానికి ముప్పుగానే ఉంటున్నాయని సాకులు చెబుతూ వచ్చారు.

కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చకనే కదా ప్రజలు భాజపా చేతికి పగ్గాలు అందించారు. వారు చేసిన తప్పిదాలను సరిదిద్దడం వీరి బాధ్యత కదా! ఆ పని చేయకుండా దేశంలో ఆయన పరిపాలించిన పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన అనేక సమస్యలకు సంబంధించి నెహ్రూను మాత్రమే నిందితుడిగా ప్రొజెక్టు చేయడం మోడీ అలవాటు చేసుకున్నారు.

ఏదైతేనేం.. ఇప్పుడు నెహ్రూ తర్వాత అలాంటి రికార్డును అందుకున్న ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లోకి ఎంటర్ అయ్యారు. మామూలుగా అయితే భారతీయ జనతా పార్టీ 75 ఏళ్లు నిండిన నాయకులను పక్కన పెట్టడం సాంప్రదాయంగా పాటిస్తూ వస్తుంది. మోడీకి 2025 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి ఆయనను పక్కన పెడతారా అనే ప్రశ్న ఎన్నికలకు ముందే వచ్చింది.

అయితే అలాంటి నిబంధన తమ పార్టీలో ఏమీ లేదని.. మోడీ అప్రతిహతంగా తమ పార్టీ తరఫున ప్రధానిగా కొనసాగుతూనే ఉంటారని.. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరి లాంటి కీలక నాయకులతో ప్రకటింపజేశారు. అవకాశం వస్తే మరోసారి కూడా ప్రధాని పదవి అదృష్టంచడానికి నరేంద్ర మోడీ సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.