Advertisement

Advertisement


Home > Politics - National

నితీష్ ఆట‌లకు ఇదే ఆఖ‌రి ఛాన్స్?

నితీష్ ఆట‌లకు ఇదే ఆఖ‌రి ఛాన్స్?

క‌మ‌లం పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఆర్జేడీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్‌, ఇప్పుడు ఆర్జేడీతో తెగ‌దెంపులు చేసుకుని క‌మ‌లం పార్టీతో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం, త్వ‌ర‌లో విశ్వాస పరీక్ష‌లో అది నెగ్గ‌డం కూడా ఈజీగానే జ‌రుగుతోంది! ఇంత‌క‌న్నా ముందు కూడా ఇలాంటి కూట‌ములు మార‌డాలు, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేయ‌డాలు నితీష్ కు కొత్త కాదు! 

ఎవ‌రి మ‌ద్ద‌తుతో ఎప్పుడో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినా సీఎం పీఠం మాత్రం నితీష్ కే ద‌క్కుతోంది! క‌మ‌లం పార్టీ అయినా, ఆర్జేడీ అయినా నితీష్ నే సీఎం సీట్లో కూర్చోబెడుతున్నాయి! త‌న‌కున్న కొద్ది పాటి సీట్ల‌తోనే నితీష్ ఇలా ముఖ్య‌మంత్రి పీఠాన్ని అట్టిపెట్టుకుంటూ ఆటాడుతున్నారు!

వేరే ఎవ‌రినైనా అయితే క‌మ‌లం పార్టీ కూడా ఇంత తేలిక‌గా ఆమోదించేది కాదు! పార్టీల‌ను చీల్చడం ఆ పార్టీకి తేలికే! అయితే నితీష్ బ‌లం నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌వుతున్నా మ‌రోసారి అత‌డినే సీఎం సీట్లో కూర్చోబెట్టింది క‌మ‌లం పార్టీ!

ఇంత‌కీ సిగ్గులేనిది ఎవ‌రికి?  నితీష్ కుమార్ కా లేక క‌మ‌లం పార్టీకా .. ఇంకోసారి నితీష్ మ‌ళ్లీ అటువైపు వెళ్లినా ఆర్జేడీ-కాంగ్రెస్ లు మ‌ళ్లీ ఆయ‌ననే భ‌ళా అంటూ సీఎం సీట్లో కూర్చోబెట్ట‌డానికి వెనుకాడ‌వు! అలాంటి చిత్రం చోటు చేసుకున్నా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు!

243 మంది స‌భ్యులున్న బిహార్ అసెంబ్లీలో నితీష్ పార్టీకి ఉన్న బ‌లం కేవ‌లం 45! అది కూడా గ‌త ఎన్నిక‌ల్లో బ‌లం త‌గ్గి జేడీయూ కేవ‌లం 45 సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. అయితే.. అటు బీజేపీకి, ఇటు ఆర్జేడీకి సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే బ‌లం లేదు!

బీజేపీకి 80 వ‌ర‌కూ సీట్లున్నాయి. ఆర్జేడీకి సొంతంగా 79 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. కాంగ్రెస్ ఖాతాలో 19 సీట్లున్నాయి.  క‌మ్యూనిస్టు పార్టీల‌కు 16 సీట్లున్నాయి. ఇలాంటి హంగ్ త‌ర‌హా ప‌రిస్థితుల్లో నితీష్ ఎటు వెళితే అటు ప్ర‌భుత్వం ఏర్ప‌డుతోంది.  ఏ కూట‌మి అయినా ఈయ‌న‌ను అలా క‌ళ్ల‌కు అద్దుకుంటూ తీసుకుంటోంది! వ్య‌క్తిగ‌తంగా నిజాయితీప‌రుడు అనే పేరుతో నితీష్ త‌న అవ‌కాశాల‌ను వాడుకుంటూ ఉన్నాడు.

అయితే జేడీయూ గ‌తంతో పోలిస్తే చాలా బ‌ల‌హీనంగా మారింది. అది గ‌త ఎన్నిక‌ల‌తోనే స్ప‌ష్టం అయ్యింది. నితీష్ తాజా నిర్ణ‌యంతో ఆ పార్టీ ఇమేజ్ మ‌రింత ప‌లుచ‌న‌ప‌డింది. రాజ‌కీయంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌డానికి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం అయినా ప్ర‌జ‌లు మెచ్చుకుంటారు కానీ, మ‌రీ ఇంత నిర్ల‌జ్జ‌గా ఒక విధానం అంటూ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం మొద‌టికే మోసం వ‌స్తుంది. క్రితం సారే అది జేడీయూను దెబ్బ‌తీసింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి దాని ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉండొచ్చు కూడా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?