నాటకీయతకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరదించారు. కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం గత వారం రోజులుగా విస్తృతంగా సాగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్లో చేరడం లేదని ఆయన ప్రకటించి, జాతీయ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇకపై రాజకీయ వ్యూహకర్తగానే వుంటారని అనుకున్నారు. అయితే రాజకీయాలపై మనసు పారేసుకున్న ఆయన ప్రశాంతంగా ఉండలేకపోయారు.
తానే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంతకాలం తాను ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించినట్టు ట్వీట్ చేశారు. ఇకపై జన్సురాజ్ (ప్రజలకు సుపరిపాలన) అందించే దిశగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు. అది కూడా తన స్వరాష్ట్రమైన బీహార్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నట్టు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఉనికిలో ఉన్న పార్టీకి వ్యూహకర్తగా పని చేయడం, సొంత పార్టీని పెట్టి సత్తా చాటడం వేర్వేరు అంశాలు. రాజకీయ పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని అధికారంలోకి తీసుకురావడం మరో ఎత్తు. వ్యూహాలు ఇచ్చినంత సులువైతే కాదు.
ఉన్న పార్టీలే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించలేక చతికిలపడుతున్నాయి. అలాంటిది ఈయన కొత్తగా పార్టీ పెట్టి ఏం సాధించాలని అనుకుంటున్నారో మరి!