రాహుల్ హీరో కావ‌డ‌మేమో గానీ…ఆయ‌న మాత్రం విల‌న్‌!

పాల‌కుల అత్యుత్సాహం ఒక్కోసారి వారి వినాశ‌నానికి దారి తీస్తుంటుంది. 2024లో బీజేపీకి ఎదురే లేద‌ని భావిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఒక్క‌సారిగా చాలా మందికి విల‌న్‌గా క‌నిపిస్తున్నారు. అన‌ర్హ‌త వేటుతో రాహుల్‌గాంధీ హీరో అయ్యారా,…

పాల‌కుల అత్యుత్సాహం ఒక్కోసారి వారి వినాశ‌నానికి దారి తీస్తుంటుంది. 2024లో బీజేపీకి ఎదురే లేద‌ని భావిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఒక్క‌సారిగా చాలా మందికి విల‌న్‌గా క‌నిపిస్తున్నారు. అన‌ర్హ‌త వేటుతో రాహుల్‌గాంధీ హీరో అయ్యారా, లేదా? అనే సంగ‌తిని ప‌క్క‌న పెడితే… కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌ని వారు లేరు.

ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, పౌర స‌మాజం రాహుల్ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుపై అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌ధాని మోదీపై ప‌రుష ప‌ద‌జాలం ప్ర‌యోగించ‌డం , దానిపై సూర‌త్ కోర్టులో ప‌రువు న‌ష్టం కేసు, దోషిగా తీర్పు… అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. క‌నీసం కోర్టుకెళ్లే హ‌క్కుని కూడా రాహుల్ స‌ద్వినియోగం చేసుకోడానికి స‌మ‌యం ఇవ్వ‌కుండా, మోదీ నేతృత్వంలో కొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన బీజేపీ స‌న్నాయి నొక్కులు నొక్క‌డం గ‌మ‌నార్హం. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటుతో బీజేపీకి సంబంధం లేద‌ని ఆ పార్టీ అగ్ర‌నేత‌లు అంటున్నారు. బీజేపీ వివ‌ర‌ణ‌ను న‌మ్మే ప‌రిస్థితిలో జ‌నం లేరు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌త్య‌ర్థుల‌పై మునుపెన్న‌డూ లేని విధంగా ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థ‌ల‌ను అడ్డు పెట్టుకుని దాడుల‌కు తెగ‌బ‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. కేవ‌లం ప్ర‌త్య‌ర్థుల‌నే టార్గెట్ చేయ‌డం వ‌ల్ల బీజేపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను సంపాదించుకుంటోంది.

అదాని విష‌యంలో బీజేపీ మౌనాన్ని రాహుల్ గాంధీ గట్టిగా నిల‌దీయ‌డం దేశ ప్ర‌జానీకం చూసింది. ఇటీవ‌ల కాలంలో అదాని వ్యాప‌రంలోని డొల్ల‌త‌నం ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డింది. అయితే అదానికి ప్ర‌ధాని, కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌న్న ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల్ని ఖండించ‌లేని దుస్థితిలో బీజేపీ వుంది. రాహుల్‌కు స‌మాధానం చెప్ప‌లేకే ఆయ‌న గొంతు నొక్కేందుకు ఏకంగా లోక్‌స‌భ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేశార‌న్న ప్ర‌చారం జ‌నంలోకి విస్తృతంగా వెళ్లింది.

ఈ చ‌ర్య‌ల్ని ఏ ఒక్క‌రూ స‌మ‌ర్థించ లేని ప‌రిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ విధానాల్ని వ్య‌తిరేకించే వాళ్లు సైతం, రాహుల్‌పై అన‌ర్హ‌త వేటును స‌మ‌ర్థించ‌లేకున్నారు. అన‌ర్హ‌త వేటుకు గురైన రాహుల్‌కు రాజ‌కీయంగా ఎంత లాభం అనే సంగ‌తి ప‌క్క‌న పెడితే, మోదీ మాత్రం విల‌న్ అయ్యార‌నేది వాస్త‌వం. రాహుల్‌పై వేటుతో ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌స్తున్నాయి. ఈ ఘ‌న‌త ప్ర‌ధాని మోదీకే ద‌క్కుతుంది.