‘రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిరాటంకంగా సాగించిన అతి సుదీర్ఘమైన పాదయాత్ర అద్భుతమైన ఫలితాలను అందించింది’ అని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి విపరీతమైన ప్రజాదరణ ఏర్పడడంలోనూ, కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల పవనాలు ఏర్పడడంలోనూ రాహుల్ పాదయాత్ర కీలక భూమిక పోషించిందనేది వారి విశ్వాసం.
కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మట్టికరిపించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి రావడం వెనుక కూడా రాహుల్ పాదయాత్ర కష్టం ఉన్నదని వారు నమ్ముతున్నారు. అందుకే దేశంలో మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానిస్తూ రాహుల్ గాంధీ మరొక పాదయాత్ర చేయడానికి వ్యూహరచన, రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
భారతదేశంలో దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వరకు రెండు చివరలను కలుపుతూ రాహుల్ చేసిన తొలి విడత పాదయాత్ర సక్సెస్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు రెండో విడత పాదయాత్ర ద్వారా దేశంలో పశ్చిమ దిక్కు నుంచి తూర్పుదిక్కు వరకు రెండు చివరలను అనుసంధానించే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. త్వరలోనే రాహుల్ పాదయాత్రకు సంబంధించిన తేదీలు, రూట్ మ్యాప్ ప్రకటిస్తామని నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా పొందిన ఊరటతో పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి దక్కించుకున్న రాహుల్ గాంధీ ఈనెల 12, 13 తేదీలలో కేరళలోని తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఎంపీగా ప్రజలతో మమేకం అవుతూ వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆ తరువాత గుజరాత్ టు మేఘాలయ రాహుల్ పాదయాత్ర ఉంటుందనేది పార్టీ వర్గాలు తెలియజేస్తున్న సంగతి.
నాయకులు పాదయాత్ర సాగించడం ద్వారా వివిధ ప్రాంతాలలోని ప్రజలతో మమేకం కావడం అనేది సాధారణమైన సంగతి. అలా సామాన్యులతో కలుస్తూ ముందుకు సాగడం ప్రజల కష్టనష్టాలు గురించి వారు ఎదుర్కొంటున్న ఈతిబాధలు గురించి నాయకులకు ఎంత మాత్రం అవగాహన కల్పిస్తాయో లేదో మనకు తెలియదు కానీ ఆయా నాయకులకు ప్రజల్లో మాత్రం కాస్త ఆదరణను తప్పకుండా సృష్టిస్తాయి.
రాహుల్ కు ఆ విషయం స్వానుభవంలో బోధపడింది. అందుకే దేశంలో మిగిలిన ప్రాంతాలను కూడా విడిచి పెట్టకుండా మైలేజీ తెచ్చుకోవడం కూడా.. పశ్చిమం నుంచి తూర్పు వైపు ఈ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అయినా, ‘తిరిగే కాలూ.. తిట్టే నోరూ.. ఊరకనే ఉండవని’ సామెత! రాహుల్ గాంధీకి కూడా ఈ సామెత వర్తిస్తుంది. ‘తిరిగే కాలు’ ఊరుకోవడం లేదు గనుక, ఇప్పుడు వెస్ట్ టూ ఈస్ట్ నడుచుకుంటూ వెళ్లిపోయినా పెద్ద ఇబ్బందేం లేదు. అలాగని ‘తిట్టే నోరు’ ఊరుకోవడం లేదు గనుక.. మళ్లీ మళ్లీ ముందూ వెనుకా చూసుకోకుండా కేంద్రాన్ని, మోడీని తిట్టడంలో దూకుడు ప్రదర్శిస్తే మరిన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటాయేమో జాగ్రత్త పడాలి.