మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిదాయకమైన రీతిలో కొనసాగుతూ ఉంది. ఒకవైపు తమకు వెన్నుపోటు పొడిచిన ఏక్ నాథ్ షిండేకు ఠాక్రేల హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. షిండే ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కొనసాగించలేదని.. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు హెచ్చరిస్తున్నారు. అసలైన శివసేన తమదేనని, ప్రజల మద్దతు కూడా తమదేనంటూ తండ్రీకొడుకులు చెప్పుకుంటున్నారు.
అదలా ఉంటే.. కేబినెట్ కూర్పుకు సిద్ధం అయ్యాడు ఏక్ నాథ్ షిండే. రేపు మహారాష్ట్ర నూతన కేబినెట్ ప్రమాణస్వీకారం చేస్తోందని తెలుస్తోంది. మొత్తం 14 మందితో ఈ కేబినెట్ ఏర్పడుతుందట. ఇప్పటికే షిండే ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు షిండే వర్గం, బీజేపీలు సమప్రాధాన్యతతో కొత్త కేబినెట్ ఏర్పడుతుందట. అయితే కీలకమైన మంత్రి పదవులు మాత్రం బీజేపీకే దక్కనున్నాయని స్పష్టం అవుతోంది.
ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద పార్టీ బీజేపీనే అయినా, షిండేకే సీఎం పీఠాన్ని అప్పగించింది కమలం పార్టీ. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఇప్పుడు కేబినెట్ విస్తరణతో కీలకమైన అడుగు వేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. అయితే… కొత్త కేబినెట్ తో అసంతృప్తవాదులు ఎవరైనా తయారవుతారా? అనేది మరో టాపిక్.
నలభై మంది తిరుగుబాటు దారుల్లో ఏడు మందికే ఇప్పుడు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఆ ఏడుమందికి పదవులు దక్కితే మిగతా వారు ఊరికే ఉంటారా? షిండే వారిని సంతృప్తి పరచగలడా? అనేది చర్చనీయాంశమే.
అయితే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై బీజేపీ కర్రపెత్తనం సాగగలదు. అసంతృప్తవాదులు ఎవరైనా తయారయితే వారిపై ఈడీ, సీబీఐ అస్త్రాలు ఉండనే ఉంటాయి. కాబట్టి.. శివసేన తిరుగుబాటుదారుల్లో మరో తిరుగుబాటు తలెత్తకుండా చూసుకోవడం కమలం పార్టీకి కష్టం ఏమీ కాదు.
ఇంకోవైపు శివసేన గుర్తు, అధికారిక గుర్తింపు విషయంలో సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అనర్హత వేటు వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం వెల్లడయ్యేంత వరకూ.. ఈ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకోవద్దంటూ సీఈసీని సుప్రీం కోర్టు ఆదేశించింది.