మహారాష్ట్రలో శివసేన రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా శివసేన పార్టీకి యజమాని తామంటే తామని ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రేను విభేదించి ఏక్‌నాథ్ పార్టీని వీడారు. ఏక్‌నాథ్ వైపు మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లారు.
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. అధికారికంగా శివసేన పార్టీని దక్కించుకోవాల్సింది. ఆ సమయం మరెంతో దూరంలో లేదు. శివసేన ఓనర్ ఎవరో తేల్చే పనిలో ఎన్నికల సంఘం ఉంది. శివసేనపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకంగా మారనుంది.
ఎందుకంటే రెండు వర్గాలు కూడా పార్టీపై అధికారం తమదే అని ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీల మద్దతు తమకు ఉందని ఎన్నికల కమిషన్‌కు షిండే లేఖ రాశారు. కావున శివసేన తమకే చెందుతుందని, పార్టీ గుర్తు విల్లు ధనుస్సు కేటాయించాలని షిండే వర్గం కోరింది.
ఈ నేపథ్యంలో ఈసీ రెండు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. శివసేన పార్టీ తమకే దక్కుతుందని నిరూపించే ఆధారాలు, రుజువులు తమకు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 8వ తేదీ వరకూ ఈసీ గడువు ఇచ్చింది. ఏక్‌నాథ్ షిండే వర్గం తన వాదనకు తగ్గట్టు బలం నిరూపించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.