పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఘన విజయంతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. పంజాబ్‌లో నంగ్రూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో శిరోమణి అకాళిదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్‌మాన్ తన సమీప ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం.
ఇక్కడి నుంచి ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రాతినిథ్యం వహించేవారు. 2014, 2019లలో వరుసగా ఆయన అక్కడి నుంచి విజయసాధించారు. ఇటీవల ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ఆయన్ను ఆప్ శాసన సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఆప్ అభ్యర్థి ఓడిపోయారు. కేవలం మూడు నెలల వ్యవధిలో పంజాబ్‌లో ఆప్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడు నెలల క్రితం పంజాబ్‌లోని మొత్తం 117 సీట్లకుగానూ ఆప్ 92 సీట్లలో విజయం సాధించింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ కూటమి 5 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జనలోక్ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన బీజేపీ 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఆప్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్న ఆప్‌కు ఎదురే ఉండదని దేశం యావత్తు భావించింది. కానీ అందుకు భిన్నమైన ఫలితం వెలువడింది. రాజకీయ పార్టీలకు పంజాబ్ ఉప ఎన్నిక ఫలితం ఓ హెచ్చరిక అని చెప్పక తప్పదు.