అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు సమర్థించగా, మరో ఇద్దరు వ్యతిరేకించడం గమనార్హం. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి చీఫ్ జస్టిస్‌తో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు.
అగ్రవర్ణాల్లోని పేదవర్గాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థించిన వారిలో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా ఉన్నారు. మెజార్టీ న్యాయమూర్తుల తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వెలువడడం విశేషం. ఈడబ్ల్యూఎస్‌పై తీర్పు వెలువరించే క్రమంలో ధర్మాసనంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రిజర్వేషన్లు సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించలేదన్నారు. అలాగే రిజర్వేషన్లలో 50శాతం పరిమితి అనేది ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండాలని లేదని పేర్కొన్నారు.
అలాగే మరో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పది శాతం రిజర్వేషన్లతో పాత కులవ్యవస్థ తిరిగి వచ్చిందని, ఎస్సీ, ఎస్టీలతో.. సమానంగా వారికి అవకాశాలు ఇస్తాయనే వాదన సరైంది కాదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత రిజర్వేషన్లపై పునఃపరిశీలించాల్సి ఉందని త్రివేది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
కానీ జస్టిస్ భట్ మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే రీతిలో చీఫ్ జస్టిస్ లలిత్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించడంతో ఉత్కంఠకు తెరపడింది.