తమిళనాడులో బ్లడ్ ఆర్ట్ పై నిషేధం..

ఫేస్ బుక్ స్నేహాలు, వాట్సప్ ప్రేమలు, ఇన్ స్టా సందేశాల కంటే ముందు ప్రేమ లేఖలే ప్రేమికులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. ప్రేమించానని చెప్పడానికి, మనసులోని ప్రేమను వ్యక్త పరచడానికి, అవతలివారిని ఇంప్రెస్ చేయడానికి…

ఫేస్ బుక్ స్నేహాలు, వాట్సప్ ప్రేమలు, ఇన్ స్టా సందేశాల కంటే ముందు ప్రేమ లేఖలే ప్రేమికులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. ప్రేమించానని చెప్పడానికి, మనసులోని ప్రేమను వ్యక్త పరచడానికి, అవతలివారిని ఇంప్రెస్ చేయడానికి ప్రేమలేఖలే ఆధారం. అలాంటి రోజుల్లో రక్తంతో ప్రేమలేఖ అనేది ఓ పెద్ద ఫాంటసీ. అలాంటి రక్తపు ప్రేమ లేఖల్ని ఘాటైన ప్రేమకు చిహ్నంగా సూచిస్తుంటారు. ఈ రోజుల్లో ఆ జంఝాటం లేదు కాబట్టి.. ఇప్పుడు ఘాటైన ప్రేమను చూపించడానికి ప్రేయసీ, ప్రేమికులు ఎంచుకున్న మరో మార్గం బ్లడ్ ఆర్ట్. రక్తంతో బొమ్మను గీసి తమకు ఇష్టమైన వారికి ఇచ్చి అపురూప జ్ఞాపకంగా దాన్ని మార్చేస్తున్నారు కొంతమంది. అయితే ఈ బ్లడ్ ఆర్ట్ ని బ్లడీ ఆర్ట్ అంటూ తమిళనాడు సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్ని నిషేధించింది.

బ్లడ్ ఆర్ట్.. ఎలా..?

పెన్సిల్ ఆర్టిస్ట్ లు, స్కెచ్ ఆర్టిస్ట్ లతో పాటు.. ఇటీవల చెన్నైలో బ్లడ్ ఆర్టిస్ట్ లు కూడా ఎక్కువయ్యారు. సిరంజి ద్వారా రక్తం సేకరించి దాన్ని చుక్కలు చుక్కలుగా పేపర్ పై వేసి మనకు ఇష్టమైన వారి బొమ్మను గీస్తారు. రక్తంతో పాటు, ఫీజు కూడా చెల్లిస్తే గంటలో బొమ్మ గీసేస్తారు. దాన్ని భద్రంగా ప్యాక్ చేసి మనకు కావాల్సిన వారికి అందిస్తే అదో మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఇటీవల చెన్నైలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. 5 మిల్లీ లీటర్ల రక్తాన్ని ఇస్తే A-4 సైజ్ షీట్ లో మంచి బొమ్మ వస్తుంది. అంతకంటే పెద్ద బొమ్మ కావాలంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ రక్తం ధారపోయాల్సిందే.

డిసెంబర్ 28 న తమిళనాడు ఆరోగ్యమంత్రి సుబ్రమణ్యం చెన్నైలోని బ్లడ్‌ ఆర్ట్‌ స్టూడియోను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ సూదులు, రక్తం నింపిన గాజు టెస్ట్ ట్యూబ్ లు చూశారు. ఒకే సూదితో వచ్చినవారందరికీ రక్తాన్ని తీస్తున్నారని, అది ఇన్ ఫెక్షన్లకు కారణం అవుతుందని, అంతకంటే మరింత ప్రమాదకరంగా కూడా ఉంటుందని తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సలహా తీసుకుని బ్లడ్ ఆర్ట్ పై నిషేధం విధించారు. 

రక్తంతో పెయింటింగ్స్‌ వేసే వ్యక్తులు లేదా సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి సుబ్రమణ్యం హెచ్చరించారు. రక్తదానం ఒక పుణ్య కార్యం అని, అలాంటి రక్తాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించకుండా ఇలా పిచ్చి పిచ్చి పనులకు, గిఫ్ట్ ఇచ్చేందుకు వినియోగించడం మంచిది కాదన్నారాయన. 

ఇష్టమైన వారి పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఇలా రక్తంతో బొమ్మలు గీయించుకోవడం ఇకనైనా యువత మానుకోవాలని హితవు పలికారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ‘బ్లడ్‌ ఆర్ట్‌’ ను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.