Advertisement

Advertisement


Home > Politics - National

అమెరికా బ్యాంకుల దివాళా.. ఆర్థిక మాంద్యం తప్పదా..?

అమెరికా బ్యాంకుల దివాళా.. ఆర్థిక మాంద్యం తప్పదా..?

2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం దెబ్బకి అల్లాడిపోయాయి. దానికి కారణం అప్పట్లో అమెరికా బ్యాంకులు దివాళా తీయడమే. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మిగతా నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కూడా అమెరికాలో రెండు పెద్ద బ్యాంకులు దివాళా తీశాయి. ఈ సారి కూడా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కుకున్నట్టేనా..? ఇప్పటికే రెసిషన్ పేరుతో ఐటీ కంపెనీలన్నీ లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడిది మరింత ఆందోళన చెందాల్సిన సందర్భమేనా..? సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ రెండూ దివాళా తీస్తే కలిగే నష్టాలేంటి..? అసలు మాంద్యం ఎలా ఉంటుంది..? అవగాహన కోసం 5 పాయింట్లు...

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంటే..?

1983లో అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) ఏర్పాటయింది. అమెరికాలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఇది 16వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఐటీ కంపెనీలకు రుణాలు ఇచ్చేది, డిపాజిట్లు స్వీకరించేది. ఇటీవల ఐటీ కంపెనీల్లో ఊహించని పురోగతి వల్ల సిలికాన్ వ్యాలీ బాగా లాభపడింది. 2019 మార్చిలో బ్యాంకుకి ఉన్న ఆస్తులు 2022 మార్చి నాటికి మూడు రెట్లు అయ్యాయి. 220 బిలియన్ డాలర్లకు పైగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కి ఆస్తులు ఉన్నాయి.

చేతిలో డబ్బులు లేవు..

ఆస్తులు భారీగానే ఉన్నా.. కనీసం కస్టమర్లకు చెల్లించడానికి కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో డబ్బులు లేకపోవడం గమనార్హం. డిపాజిటర్లకు తిరిగివ్వడానికి కూడా ఇటీవల బ్యాంకులో నగదు లేకపోవడంతో.. ఆ వార్త వైరల్ అయింది. అందరు కస్టమర్లు ఒకేసారి బ్యాంకుపై పడ్డారు. దీంతో అది దివాళా తీసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వడ్డీరేటు తక్కువగా ఉన్న సమయంలో గవర్నమెంట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. 

ఇటీవల ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోడానికి ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచింది. దీంతో సహజంగానే గవర్నమెంట్ బాండ్ల విలువ తగ్గింది, అలా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నష్టపోయింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కస్టమర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆస్తులు అమ్మి చెల్లింపులు చేపట్టింది. ఈ విషయం బయటపడి SVB షేర్ ధర 60శాతం కుంగింది. మార్చి 10న కాలిఫోర్నియా రెగ్యులేటర్లు బ్యాంక్ ని సీజ్ చేశారు.

అమెరికా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం..

ప్రస్తుతం ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్   SVB వ్యవహారాలను టేకోవర్ చేసింది. 170 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు FDIC దగ్గర ఉన్నాయి. SVB ఆస్తులన్నిటినీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. బ్రిటన్ లోని బ్రాంచ్ ని HSBC బ్యాంక్ టేకోవర్ చేసింది. ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా చూస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మాటిచ్చారు. అదే సమయంలో బ్యాంక్ కస్టమర్లకు జరిగిన నష్టాన్ని ఇతర రంగాల నుంచి భర్తీ చేయబోమని స్పష్టం చేశారు.

కస్టమర్లు ఏం చేస్తున్నారు..? ఏం చేయాలి..?

కస్టమర్లు అంతా తమ సొమ్ము వెనక్కి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యాజమాన్యం మాత్రం తొందరపడొద్దని సలహా ఇస్తోంది. అందరూ సొమ్ము వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఆ ప్రభావం బ్యాంక్ పై పడుతుందని చెబుతున్నారు అధికారులు. బ్యాంకులో తిరిగి డిపాజిట్లు చేయాలని కోరుతున్నారు.

ఇప్పుడేం జరుగుతుంది..?

అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ రెండూ దివాళా తీయడంతో అసలు బ్యాంకింగ్ రంగంపైనే మదుపరుల విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇది కేవలం అమెరికా బ్యాంకులకే కాదు, ఇతర అన్నిదేశాల్లోనూ ఇదే పరిస్థితి. బ్యాంకింగ్ షేర్లు కుప్పకూలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఈ భయాలు పెరిగి పెద్దవై.. త్వరలోనే బ్యాంకింగ్ షేర్లపై దెబ్బపడే అవకాశముంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?