కోర్టు తీర్పులు కొందరికి సంతోషం కలిగిస్తే, కొందరికి విచారం కలిగిస్తాయి. వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా ఇది సహజం. ఏదైనా ఒక విషయంలో కింది కోర్టులు (హై కోర్టు సహా) వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సుప్రీం కోర్టుకు పోవొచ్చు. అక్కడా వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని ఆమోదించాల్సిందే కదా. మన దేశంలో అదే కదా చివరి కోర్టు, అత్యున్నత న్యాయస్థానం కూడా.
ఇలా ఒక తీర్పు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వడంతో మోడీ సర్కారు చాలా సంతోషంగా ఉంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షాల మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను, సీబీఐని విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారని, ఆ రెండింటిని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని, అనవసరంగా వారి ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరిపించి మానసిక క్షోభకు గురి చేస్తోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే కదా.
మోడీ – ఈడీ అంటూ ఈ మధ్య తెలంగాణా మంత్రి కేటీఆర్ కూడా విమర్శించారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈ రెండు దఫాలుగా కొన్ని గంటలపాటు విచారించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు భారీగా ఆందోళనలు నిర్వహించారు.
రాహుల్ గాంధీని అరెస్టు కూడా చేశారు. ఈ మధ్య కాలంలో చాలామంది వ్యాపార, పారిశ్రామికవేత్తల మీద, రాజకీయ నాయకుల మీద ఈడీ దాడులు జరిగాయి. దీంతో మోడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.
ఈ చట్టం ప్రకారం పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్ వంటి అన్ని చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కూడా న్యాయస్థానం కొట్టిపారేసింది. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక- ఈసీఐఆర్‌ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న కోర్టు.. అది ఎఫ్ఐఆర్తో సమానమని స్పష్టం చేసింది. ఆరోపణలపై ఆధారాల కోసం నిందితుడిపై ఒత్తిడి చేయడం అంటే అతడి ప్రాథమిక హక్కు, జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్లు వాదించగా.. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి సవాళ్లుగా మారిన ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవని కేంద్రం పేర్కొంది.
ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈడీ అధికారాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో బీజేపీ నాయకులకు మరింత ఊపు వస్తుంది.