Advertisement

Advertisement


Home > Politics - National

పాపం.. ఫలితం రాకముందే క్యాంపు కష్టాలు!

పాపం.. ఫలితం రాకముందే క్యాంపు కష్టాలు!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెసు పార్టీ తరఫున గెలుపుబాటలో ఉన్న ఎమ్మెల్యేలు సంతోషపడుతూ ఉండవచ్చు గానీ.. వారిని కాపాడుకోవడం ఎలా, ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా వారు పార్టీ ఫిరాయించకుండా చూడడం ఎలా? అనే మధనంలో కాంగ్రెస్ సతమతం అవుతోంది. ఆ రాష్ట్రంలో ఇంకా ఒక్క సీటు ఫలితం కూడా వెలువడలేదు. (రాస్తున్న సమయానికి) ఇప్పటికి 34 స్థానాల్లో కాంగ్రెస్, 31 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉన్నాయి. అయితే.. ఇప్పటినుంచే గెలవబోయే తమ ఎమ్మెల్యే అందరినీ క్యాంపు కు తరలించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నది. ప్రియాంక వాధ్రా స్వయంగా సిమ్లా చేరుకుని.. అక్కడి రాజకీయ స్థితిగతులను సమీక్షించబోతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సాంప్రదాయాన్నే కొనసాగించే పరిస్థితి ఏర్పడుతున్నదా? అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ దఫా మోడీ దళానికి ఉన్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా బిజెపి ఆ సంప్రదాయాన్ని తిరగరాసి.. రెండోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు కొంతమేర సాగాయి. అయితే.. ఫలితాలు వెలువడుతుండగా.. ఆ గెలుపు అంత ఏకపక్షం కాదని, పోటీ హోరాహోరీగా ఉన్నదని అర్థమవుతోంది. అంతో ఇంతో కాంగ్రెస్ కే మెజారిటీ అవకాశాలు ఉన్నాయి. మూడు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. 

సాధారణంగా రెండు ప్రధాన పార్టీల మద్య ఇంత తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు.. ఫిరాయింపులు సహజంగా జరుగుతుంటాయి. ఆ నేపథ్యంలో ఆపరేషన్ కమలం ప్రయత్నాలు అడ్డుకోవాలని కాంగ్రెస్ తపన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి ఆధిక్యాలే విజయాలు గా కూడా నమోదు అయితే.. కాంగ్రెస్ కూడా 34 స్కోరు వద్దనే ఆగిపోతుంది. నిజానికి వారికి అధికారం కోసం 35 సీట్లు కావాలి. వారైనా ఇతరుల్ని ఆకర్షించాల్సిందే. అదే పని బిజెపి కూడా చేయాల్సి వస్తుంది. వారు ఏకంగా నలుగురిని కొత్తగా తమ జట్టులోకి తీసుకోవాలి. ఇలాంటి బేరసారాలకు పాల్పడే సమయంలో.. కేంద్రంలో కూడా అధికారంలోకి ఉన్నందున అంతో ఇంతో బిజెపికే ఎడ్వాంటేజీ  ఉంటుంది. అందుకే.. కాంగ్రెస్ ముందే జాగ్రత్త పడుతోంది. 

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో, అంతా పూర్తయి విజయాలు ఖరారు అయిన తర్వాత.. ధ్రువపత్రాలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలను క్యాంపులోకి తరలించాలని ఆలోచిస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో రాజస్తాన్ పంపడానికి కాంగ్రెస్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నది. ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భపేశ్ భగేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా ఈ క్యాంపు పని చూస్తున్నారు. ఇక్కడ అదికారంలోకి రాగలిగితే.. కాంగ్రెస్ కు కాస్త ఊపిరి అందుతుంది. కానీ సాయంత్రంలోగా ఎన్ని పరిణామాలు మారుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?