వెంకయ్యలో ఇంకా రాజకీయ ఆశలు.. నెరవేరేనా?

భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా అత్యున్నతమైన ఒక పదవిని నిర్వహించిన తర్వాత.. తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పోటీచేయకూడదనే నిబంధన ఏమీ లేదు. కానీ.. అంత పెద్ద పదవి చేపట్టాక.. ఎవ్వరూ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు…

భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా అత్యున్నతమైన ఒక పదవిని నిర్వహించిన తర్వాత.. తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పోటీచేయకూడదనే నిబంధన ఏమీ లేదు. కానీ.. అంత పెద్ద పదవి చేపట్టాక.. ఎవ్వరూ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు మాత్రం మన 75 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో లేవు. ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఎదురు కాబోతోందా? ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేస్తున్న తెలుగునేత వెంకయ్యనాయుడు.. మళ్లీ క్రియాశీల రాజకీయాల గురించి కలగంటున్నారా? ప్రధాని మోడీ కూడా తన కల తీరడానికి అనుకూలంగానే మాట్లాడుతున్నట్లు భావిస్తున్నారా? ఇంతకూ ఆయన కల తీరుతుందా? 

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సింహాసనం దిగుతున్నారు. ఆయనకు ఘనమైన వీడ్కోలు కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ముగిసిపోయింది. ఆయన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ భరితమైన ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉండగా.. వెంకయ్యనాయుడు కూడా భావోద్వేగానికి గురయ్యారు.. అని మనం పత్రికల్లో చదువుకున్నాం. ఇంతకూ ఎవరు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అనేది అప్రస్తుతం!

అయితే మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఉపరాష్ట్రపతిగా మీ బాధ్యతలు ఇక్కడితో ఆగిపోవచ్చు గానీ.. మీ అనుభవాల నుంచి మేం మరిన్ని ప్రయోజనాలు పొందడం మాత్రం కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. ఈ మాట వెంకయ్యనాయుడు అభిమానులకు మాత్రం చాలా రుచికరంగా కనిపిస్తోంది. వెంకయ్యనాయుడు సేవలను తిరిగి పార్టీ కోసం ఉపయోగించుకోవాలని మోడీ భావిస్తుండడానికి ఇది సంకేతం అని అందరూ అంటున్నారు. 

వెంకయ్యనాయుడు ఇంకా సుదీర్ఘ కాలం క్రియాశీల రాజకీయం నెరపగల ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉన్నారని ఈ విషయం మోడీకి తెలుసు గనుక.. ఆయన సేవల్ని మళ్లీ వాడుకుంటారని వారు అనుకుంటున్నారు. మోడీ మాటలను బట్టి.. వెంకయ్యనాయుడు కూడా తిరిగి రాజకీయ జీవితం ఉంటుందని కలలు కనే అవకాశమూ ఉంది. 

కానీ.. మోడీ మాటలను అలా నమ్మడానికి, అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఏ చిన్న ఉద్యోగి రిటైర్ అయినా కూడా.. ‘ఆయన సేవలు మనకు ఇంకా చాలా అవసరం.. ఆయన సేవల్ని మనం వాడుకోవాలి..’ అని పదవీవిరమణ సభలో చాలా మంది వక్తలు అంటారు. కానీ.. ఆయనను ఇంటికి పంపించిన తర్వాత.. మళ్లీ ఎవరూ ఆయన మొహం చూడరు. వెంకయ్యనాయుడు విషయంలో మోడీ అన్న మాటలు కూడా అలాంటివే. ‘మీ అనుభవాలనుంచి మేం ప్రయోజనాలు పొందడం కొనసాగుతుంది’ అన్న మాటల్ని పట్టుకుని.. మళ్లీ వైభవం దక్కుతుందని అనుకుంటే పొరబాటు! అద్వానీ లాంటి మహామహుడినే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిన వ్యక్తి మోడీ. అలాంటిది వెంకయ్యకు మళ్లీ ప్రాముఖ్యం దక్కే ఏ పని అయినా అప్పగిస్తారని అనుకోవడం భ్రమ.

చూడబోతే.. మోడీ మాటలను.. తమకు తోచిన, తాము వలచిన రీతిలో వండి వార్చడం తెలుగు మీడియా వంతుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రెండు రోజుల కిందట సమావేశంలో.. చంద్రబాబు నాయుడుతో ‘మిలేంగే’ అని అన్నందుకు.. ‘అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తూ ఉండండి’ అని మోడీ ప్రేమ కురిపించినట్లుగా భాష్యం చెప్పారు. 

ఇప్పుడు.. ‘మీ అనుభవాల ప్రయోజనాలు మాకు ఇంకా అవసరం’ అంటే.. వెంకయ్యకోసం ఇంకో వైభవమైన పదవి వేచి ఉన్నదనే భాష్యం చెప్పగలరు. ఇలాంటి మీడియా కథలను నమ్ముకుని అభిమానులు ఎవరైనా ఆశలు పెంచుకుంటే.. గల్లంతు అవుతారంతే..!