తమిళ సినిమా జెంటిల్ మన్ లో ఒక సీన్ ఉంటుంది. అందులో బడిలో పిల్లలకు అన్నం చేసి పెట్టే ఆయా అయిన మనోరమ పాత్ర తన తనయుడి మెడికల్ ఫీజు కోసం తన చీర కొంగును మంటలోకి వేసి అగ్నికి ఆహుతి అవుతుంది. ఆమె ప్రభుత్వ విధిలో మరణించడం వల్ల డబ్బు వస్తుందని, దాంతో కొడుకు మెడికల్ కాలేజీ ఫీజు చెల్లించవచ్చు అని ఆమె అలా ఆత్మర్పన చేసుకుంటుంది. ఆ సినిమా సంచలన విజయం సాధించింది.
అదే తమిళనాట అలాంటి విస్మయకరమైన ఘటన జరిగింది. తన తనయుడి కాలేజీ ఫీజు కోసం ఒక తల్లి బస్సు కింద పడి మరణించింది. తను యాక్సిడెంట్ లో మరణిస్తే పరిహారం వస్తుందని, ఆ డబ్బుతో తన పిల్లలు చదువుకోవచ్చని ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 45 యేళ్ల వయసున్న పాపతి అనే మహిళ 15 యేళ్ల కిందటే భర్త వదిలేయగా, తన పిల్లలను తన రెక్కల కష్టం మీద పోషించుకుంటూ వచ్చింది. ఆమె కలెక్టర్ ఆఫీసులో పని చేస్తూ ఉందట.
ఇలాంటి నేపథ్యంలో పిల్లల పోషణకు ఆమె అష్టకష్టాలూ పడుతూ వచ్చిందని, ఇప్పుడు తను మరణిస్తే వచ్చే పరిహారంతో తన పిల్లల ఫీజులకు పనికొస్తుందని ఆమె ఆలోచించింది. ముందుగా ఆమె ఒక బస్సు కింద పడబోయిందని, అప్పుడు ఆమెను బైక్ ఢీ కొన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె వేగంగా వస్తున్న మరో బస్సుకు అడ్డుగా వెళ్లింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో సైతం రికార్డు అయ్యాయి. వాహనాలకు ఎదురుగా రోడ్డు సైడ్ నడుచుకుంటూ వెళ్తూ, బస్సు రావడాన్ని గమనించి ఆమె రోడ్డుకు అడ్డంగా వచ్చి, అది ఢీ కొనడంతో అక్కడిక్కడే మరణించిన వైనం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పిల్లల ఫీజు కోసం ఆమె ఇంత తీవ్రమైన నిర్ణయాన్నీ తీసుకుని ఆత్మార్పణ చేసుకోవడం విషాదకరం.