రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్… కొద్ది రోజుల క్రితం వరకూ ఎవరికీ పెద్దగా తెలియని పేరు. ఇపుడు మాత్రం సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయారు. కరోనా వైరస్ కారణం చెప్పి స్థానిక ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారు. దాంతో ఆయన ఒక్కసారిగా టీడీపీ వారికి దేవుడే అయిపోయారు.
ఆయన చిత్ర పటాలకు యమ గిరాకీ వచ్చేసింది. విశాఖ వీధుల్లో నిమ్మగడ్డ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేసిన తమ్ముళ్ళు ఇపుడు కనిపిస్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యం కాపాడిన మహానుభావుడంటూ కీర్తిస్తున్నారు.
ఇంతకు ముందు కూడా శాసనమండలి చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకాలు జోరుగా సాగాయి. అప్పట్లో ఆయన ప్రజాస్వామ్య పరిరక్షకుడు అయ్యారు. చిత్రమేంటంటే షరీఫ్ అయినా రమేష్ అయినా విచక్షణాధికారం పేరు చెప్పే నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంకా చిత్రమేంటంటే ఈ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువ ఆనందించింది టీడీపీ మాత్రమే. దాంతో షరీఫ్, రమేష్ చిత్ర పటాలు ఇపుడు ఎన్టీయార్, చంద్రబాబు తో సమానంగా టీడీపీ కార్యకర్తలు మనసులో పెట్టుకుని మరీ కొలుస్తున్నారు.
దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అపుడే ఏమైంది చంద్రబాబూ, వాయిదాకే గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు మీకూ, మీ కార్యకర్తలకు ముందుంది అసలైన పండుగ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ చూసినపుడు ఓవర్ నైట్ నిమ్మగడ్డ వారు అద్భుతమైన ఫ్యాన్ మెయిల్ సంపాదించుకున్నారు అనుకోవాలేమో.