ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ నిన్న అత్యున్నత చట్టసభలో కన్నీళ్లు పెట్టుకోవడం వైరల్ అయ్యింది. నిజమే, చర్చలకు నిలయాలు కావాల్సిన లోక్‌సభ, రాజ్యసభలు రచ్చలకు వేదికలుగా మారాయి. దేశ అత్యున్నత చట్ట సభలే కాదు, రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏ రాష్ట్ర అసెంబ్లీ చూసినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో …తిట్టుకోవడం, కొట్టుకోడానికి వేదికలుగా చట్టసభలు మారాయనే బలమైన విమర్శ ఉంది.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో గందరగోళ పరిణామాలపై ఆ చట్ట సభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే సందర్భంలో వెంకయ్యపై నెటిజన్లు తమదైన స్టైల్లో సెటైర్లు విసురుతున్నారు.
‘కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభలో ప్రవర్తించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేయడానికి, అలాంటి చర్యలను ఖండించడానికి నాకు మాటలు రావడం లేదు. రాత్రంతా నిద్రపట్టలేదు. సభ ఈ స్థాయికి ఎలా వచ్చిందనే కారణాన్ని అన్వేషించడానికి చాలా ప్రయత్నించాను. సభకు పవిత్రత ఉంది. మన దేవాలయాల్లో భక్తులను గర్భగుడి వరకే అనుమతిస్తారు తప్పితే అంతకుమించి లోపలికి రానివ్వరు. ఈ సభామందిర గర్భగుడిలోకి ప్రవేశించడమే అపవిత్ర చర్య. కొందరు సభ్యుల తీరు నన్నెంతో క్షోభకు గురి చేసింది’’ అని అంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదే వెంకయ్యనాయుడు 2014లో ఏపీ విభజన సమయంలో రాజ్యసభ సభ్యుడిగా చేసిన అద్భుత ప్రసంగాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు బలమైన డిమాండ్‌తో నాటి యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.
వెంకయ్య డిమాండ్‌కు తలొగ్గి ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ప్రకటిస్తే.,.. కాదు కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు కొట్లాడి మరీ ఒప్పించిన సంగతిని నెటిజన్లు, ప్రజాస్వామిక వాదులు గుర్తు చేస్తున్నారు.
నాడు గర్భగుడిలో ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన మోడీ సర్కార్ వైఖరి ఎప్పుడూ కన్నీళ్లు తెప్పించలేదా? ఏపీని వంచించిన మోడీ పాలన తలచుకుని నిద్రలేని రాత్రులు గడపలేదా వెంకయ్యా? అంటూ నెటిజన్లు, ఏపీ పౌర సమాజం ప్రశ్ని స్తోంది, నిలదీస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.
రాజ్యసభలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితికి కారణమైన రైతు వ్యతిరేక చట్టాలు, అలాగే పెగాసస్ ఉదంతం ఆమోదయోగ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే, హరిస్తుంటే కన్నీళ్లు రావడం లేదా వెంకయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు.