ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో శివసేనకు దోస్తీ కుదరుతుందని అస్సలు ఊహించినట్టుగా లేదు భారతీయ జనతా పార్టీ. శివసేన ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లలేదని బీజేపీ లెక్కలేసుకుంది. సేనతో దోస్తీ చేయడానికి కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుందని కూడా కమలం పార్టీ అనుకుంది. అయితే బీజేపీకి ఝలక్ ఇవ్వడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా ఉంది!
రాష్ట్రపతి పాలన సాగుతున్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీలు రెడీ అవుతున్నాయి. పదవుల పంపకాల విషయంలో కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అయితే తమకు దక్కని అధికారాన్ని అలా తమతో విబేధిస్తున్న వారికి దక్కడాన్ని సహజంగానే కమలం పార్టీ సహించలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో కమలం పార్టీ కొత్త ప్లాన్ కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
అదేమిటంటే.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం! బీజేపీకి సొంతంగా వచ్చిన సీట్లతో అది కుదరని పని, పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచి, గెలిచిన ఎమ్మెల్యేలను కలుపుకున్నా, కలిసి వచ్చిన ఇండిపెండెంట్లను కూడినా బీజేపీ బలం నూటా పద్దెనిమిది. మెజారిటీకి ఆమడదూరంలో ఉంది కమలం పార్టీ.
అయితే గవర్నర్ కమలం పార్టీ మాజీ నేతే. కాబట్టి.. తమకు అవకాశం ఇవ్వాలని ఆయనను బీజేపీ కోరనుందట. ఆయన అవకాశం ఇస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పటుకావొచ్చు. బలనిరూపణ నాటికి ఎమ్మెల్యేలను సేన-కాంగ్రెస్-ఎన్సీపీల నుంచి తెచ్చుకోనూ వచ్చు! ఆ తర్వాతి సంగతి ఆ తర్వాత.
అందుకే ఇప్పుడు ఆ పార్టీలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ మూడు పార్టీలూ మూకుమ్మడిగా ఆరోపిస్తున్నాయి.