నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ….రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండడం వల్ల నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కొన్ని పవర్స్ సమకూరాయి. అయితే రాజ్యాంగ పదవి అధికారాలు ఇవ్వగలదే తప్ప ….ప్రత్యేక గౌరవాన్ని తెచ్చి పెట్టదు. ఎందుకంటే అధికారంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది.
వ్యక్తిగత నడవడిక, పనితీరుతో వ్యక్తులకు సమాజంలో గౌరవ, మర్యాదలు దక్కుతాయి. ఒకవేళ ఏ వ్యక్తికైనా పదవుల వల్ల ప్రత్యేక గౌరవ మర్యాదలు దక్కితే… అవి ఆ పదవి ఉన్నంత వరకే అనే వాస్తవాన్ని గ్రహించాలి. పదవి నుంచి దిగిపోయిన మరుక్షణమే కనీసం ఆ కార్యాలయంలోని అటెండర్ కూడా లెక్క చేయరు.
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి అనేక కారణాలున్నాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిరిగి పునర్నియామకం అయిన తర్వాతైనా సామరస్య వాతావరణం నెలకుంటుందని ఆశించిన వారికి తాజా పరిస్థితులు నిరాశ మిగిల్చాయని చెప్పక తప్పదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు, ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు.
అలాగే తగిన కొవిడ్ రక్షణ చర్యలు చేపడుతూ స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికల్ని కలెక్టర్లు రూపొందించుకోవాలని నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడీ ఆదేశాలు, సూచనలు వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలని ఆమె సూచించారు.
అయితే చీఫ్ సెక్రటరీ లేఖ ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే అని నీలం సాహ్నికి ఆయన బదులిచ్చారు. పంచాయతీ ఎన్నికలపై సమాచారం పంపితే, దానిపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పడం కూడా రాజ్యాంగ వ్యవస్థని ధిక్కరించడమే అని నిమ్మగడ్డ భావిస్తే …ఇక భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వానికే లేకపోతే, దాన్ని ఎన్నుకున్న ప్రజల మాటేమిటి? ఇంతకూ ప్రజాప్రభుత్వానికి రాజ్యాంగంలో స్థానమేమిటో ఇటీవల పరిణామాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అయితే నిమ్మగడ్డ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్న అంశాల్ని లోతుగా పరిశీలిస్తే …ఆయన విశ్వసనీయతపై సామాన్య జనానికి కూడా అనుమానాలు కలుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంచాయతీ ఎన్నికలకు వెళ్లే క్రమంలో ఆయన ప్రస్తావించిన అంశాల గురించి చర్చిద్దాం.
“స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత రాజ్యాంగంలోని 243కె. 243 జెడ్ఏ అధికరణాల ప్రకారం తప్పని సరి”
ఈ ఒక్క మాట చాలు నిమ్మగడ్డ విశ్వసనీయతపై అనుమానం తలెత్తడానికి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రెండేళ్ల క్రితం చంద్రబాబు పాలనలో పూర్తి కావాల్సి ఉంది. మరి అప్పుడు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమారే ఉన్నారు.
ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 243కె. 243 జెడ్ఏ అధికరణాల ప్రకారం స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని గుర్తు చేస్తున్న పెద్ద మనిషి …రెండేళ్ల క్రితం భారత రాజ్యాంగం గుర్తు రాకపోవడానికి కారణం ఏంటి? అప్పుడు సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఎప్పుడైనా కారణాలు చెప్పారా?
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో శాసన సభ ఉప ఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్‌కుమార్ ప్రస్తావించారు. అక్కడ ఎన్నికల నిర్వహణ వల్ల కరోనా వ్యాప్తి పెరిగినట్టుగా నిర్ధారణ కాలేదన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లినా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు అక్కడి యంత్రాంగం సిద్ధమైంది అని గుర్తు చేశారు.
ఎంత సేపూ తనకు అనుకూలమైన వాదనను తెర మీదకు తెస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించడమేనా? లేక ఎప్పుడైనా తన అంతరాత్మను ప్రశ్నించుకున్న దాఖలాలున్నాయా? కరోనా గురించి లోకానికి తెలియని రోజుల్లో నిమ్మగడ్డ ఏం చేస్తున్నట్టు? తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు అక్కడి యంత్రాంగం సిద్ధమైందన్న విషయాన్ని ప్రత్యేకంగా నిమ్మగడ్డ చెప్పాల్సిన పనిలేదు.
కానీ జీహెచ్ఎంసీకి సకాలంలో ఎన్నికలను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ సమన్వయంతో జరుపుతున్నారు. అది అక్కడికి, ఇక్కడికి ఉన్న తేడా. ఏపీలో సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి ఉంటే … ఇప్పుడీ రాజ్యాంగ సంస్థల మధ్య ఘర్షణ అనే మాటే తలెత్తి ఉండేది కాదు కదా?
గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక … షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలపడంలో నిమ్మగడ్డ ఉద్దేశం ఏంటి?
తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలకు నిమ్మగడ్డ ఇస్తున్న గౌరవం ఇదేనా? అన్నీ నిర్ణయించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో ఇక సంప్రదించేది ఏముంది? ఇక ఆ పని కూడా తానే చేయొచ్చు కదా? అడ్డుపడేదెవరు? ఎవరూ ప్రశ్నించజాలని రాజ్యాంగ పదవిలో ఉన్నారు కదా?
అయినా ఎన్నికల ప్రతిపాదనపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పక ముందే కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడం దేనికి సంకేతం? ఎన్నికల ప్రక్రియ, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే అధికార యంత్రాంగం తన పరిధిలోకి వస్తుందని తెలిసి కూడా పెత్తనం చెలాయించాలనే తొక్కులాట దేనికి? ఇప్పుడివే అందరి మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వాలు, వ్యక్తులు శాశ్వతం కాదు.
రాజ్యాంగ వ్యవస్థలు మాత్రమే శాశ్వతం. కానీ రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తాను పదవి నుంచి దిగిపోయిన తర్వాత, వచ్చే అధికారులకు తాను ఏ విలువలకు ప్రతీకగా చెప్పుకుంటారో ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. ప్రతి విషయాన్ని రాజ్యాంగ పదవితో ముడిపెట్టి , ఏదో చేయాలనుకోవడం సమాజం హర్షించదు. ప్రజల కోసం రాజ్యాంగం తప్ప, పంతాల కోసం కాదని గ్రహిస్తే మంచిది.