మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించ‌నున్న నిమ్మ‌గ‌డ్డ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మ‌ధ్య వ్య‌వ‌హారం చ‌ద‌రంగం క్రీడ‌ను త‌ల‌పిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేయ‌డంలో ఎవ‌రికీ ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. పావులు క‌దప‌డంలో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎంత దిట్టో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మ‌ధ్య వ్య‌వ‌హారం చ‌ద‌రంగం క్రీడ‌ను త‌ల‌పిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేయ‌డంలో ఎవ‌రికీ ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. పావులు క‌దప‌డంలో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎంత దిట్టో ఆయ‌న వేస్తున్న ఒక్కో అడుగు తెలియ‌జేస్తోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేదంటూ మ‌రోసారి ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక ఆయ‌న ముందున్న ప్ర‌త్యామ్నాయం కూడా అదొక్క‌టే. అయితే జ‌గ‌న్ స‌ర్కార్ స్వ‌యం ప్ర‌తిప‌త్తి సంస్థ అయిన ఎన్నిక‌ల సంఘానికి ఎలాంటి స‌హ‌కారం అందించ‌లేద‌ని నిరూపించేందుకు త‌గిన ఆధారాల‌ను ఆయ‌న సేక‌రించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డాన్ని చూడొచ్చు.

రెండు రోజుల క్రితం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఈ మేరకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం కావాలంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ఉద్దేశం లేద‌ని ఎస్ఈసీకి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  ఓ లేఖ రాశారు.

అలాగే ఆ లేఖ‌లో క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో ఇప్పుడు ఆ విష‌య‌మై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా తేల్చి చెప్పారు. దీంతో నిన్న ఎస్ఈసీ నిర్వ‌హించాల్సిన వీడియో కాన్ఫ‌రెన్స్ ర‌ద్ద‌యింది.

ఎస్ఈసీ దృష్టిలో త‌న‌కు చీఫ్ సెక్ర‌ట‌రీ ఆ విధంగా లేఖ రాయ‌డం రాజ్యాంగ విరుద్ధం. అలాగే ప్ర‌భుత్వం త‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ త‌ప్పు దొరికిన‌ట్టైంది. ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వం త‌న‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని ఫిర్యాదు చేశారు. అంటే త‌న స‌మ‌స్యను గ‌వ‌ర్న‌ర్ దృష్టికి కూడా తీసుకెళ్లాన‌ని చెప్పేందుకు ఓ వాద‌న‌ను సిద్ధం చేసుకున్న‌ట్టైంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌కు స‌హ‌క‌రించ‌ద‌ని తెలిసి కూడా కేవ‌లం ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో ముచ్చ‌ట‌గా రెండోసారి కూడా చీఫ్ సెక్ర‌ట‌రీకి వీడియో కాన్ఫ‌రెన్స్ విష‌య‌మై లేఖ రాశారు. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో గురువారం కూడా వీడియో కాన్ఫ‌రెన్స్‌ను ర‌ద్దు చేసుకున్నారు. దీంతో ఆయ‌న‌కు కావాల్సిన ముడి స‌రుకు దొర‌కిన‌ట్టైంది. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌న‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తోంద‌ని , ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోయిందంటూ న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్ల‌డానికి ఎస్ఈసీ అవ‌స‌ర‌మైన త‌గిన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ప‌దేప‌దే ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి తాను ప్ర‌య‌త్నిస్తున్నా, అటు వైపు నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని న్యాయ స్థానంలో గ‌ట్టి వాద‌న వినిపించేందుకు అన్ని ర‌కాల ఆధారాల‌ను ఎస్ఈసీ సిద్ధం చేసుకున్న‌ట్టు ….ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డ‌మే ఆల‌స్యం. ఎటూ త‌న‌కు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌లేద‌నే పిటిష‌న్ హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ ఆల్రెడీ వేసి ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హ‌కారం కావాలో తెలియ‌జేస్తూ అఫిడ‌విట్ వేయాల‌ని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ మ‌రోసారి కోర్టు మెట్లు ఎక్క‌నుండ‌డం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ…ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం