వచ్చే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ….తన హయాంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని బలమైన సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన లక్ష్యం వైపు కదులు తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. మున్సిపల్ ఎన్నికలకు కూడా రీషెడ్యూల్ ప్రకటించారు. ఇక మిగిలింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే.
మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ఆగిన చోటు నుంచే తిరిగి చేపట్టాలని ప్రభుత్వం విన్నవించింది. ఈ మేరకు ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చర్చించారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలను ఆగిన చోటు నుంచే నిర్వహించేందుకు నిమ్మగడ్డ సుముఖంగా లేరు. మరోవైపు గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలను రద్దు చేయాలని, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యే మార్గంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేదనే ఎవరైనా భావించి, అందుకు తగ్గ ఆధారాలు తమ దగ్గర ఉంటే వాటిని కలెక్టర్‌కు సమర్పించాలంటూ తాజాగా ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాంటి వాటిని కలెక్టర్ పరిశీలించి తనకు ఈ నెల 20లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు.
గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఆ ప్రకటనతో పేర్కొంది. అలాంటి అభ్యర్థులకు తిరిగి నామినేషన్లు వేయడానికి మరో అవకాశాన్ని కల్పిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు. నిజానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనే రద్దు చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేది నిమ్మగడ్డ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడు తున్నారు. అలా చేస్తే, ఏకగ్రీవమైనట్టు డిక్లరేషన్ ఫారాలు అందుకున్న వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, అసలుకే ఎసరు వస్తుందనే ఉద్దేశంతో, ఎస్ఈసీ చివరి అస్త్రంగా ఈ రకమైన డొంక తిరుగుడు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.
కానీ కలెక్టర్లు ఇచ్చే నివేదికలపైనే అంతిమంగా ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ కోరుకుంటున్నట్టు కలెక్టర్ల నుంచి నివేదికలు వెళ్తాయనేదే కేవలం భ్రమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలపై ఆయా కలెక్టర్ల నుంచి ఎలాంటి నివేదికలు ఎస్ఈసీకి అందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.