వారెవ్వా నిమ్మ‌గ‌డ్డా…ప్ర‌భుత్వంపై పొగ‌డ్త !

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ప్ర‌భుత్వం విష‌యంలో త‌న రూట్ మార్చారు. జ‌గ‌న్ స‌ర్కార్‌, నిమ్మ‌గ‌డ్డ మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితిని గ‌త కొంత కాలంగా చూస్తున్నాం.  Advertisement త‌మ…

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ప్ర‌భుత్వం విష‌యంలో త‌న రూట్ మార్చారు. జ‌గ‌న్ స‌ర్కార్‌, నిమ్మ‌గ‌డ్డ మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితిని గ‌త కొంత కాలంగా చూస్తున్నాం. 

త‌మ అయిష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో ఎవ‌రికి వారే సాటి అని చెప్పాలి. అయితే ప్ర‌భుత్వం విష‌యంలో నిమ్మ‌గ‌డ్డ తాజాగా పొగ‌డ్త‌లు కురిపించ‌డం విశేషం. అయితే ఊరికే పొగ‌డ‌రు మ‌హానుభావుల‌ని …నిమ్మ‌గ‌డ్డ పొగడ్త‌ల వెనుక ఆంత‌ర్యం అర్థం కావాల్సిన వాళ్ల‌కు బాగా అర్థ‌మై ఉంటుందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌భుత్వంపై పొగడ్త‌ల‌తో పాటు మ‌రో కీల‌కమైన అంశాన్ని కూడా నిమ్మ‌గ‌డ్డ ప్ర‌క‌టించారు. అది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.  ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆయ‌న తేల్చి చెప్పారు. అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మంగ‌ళ‌వారం నిమ్మ‌గ‌డ్డ మీడియాతో మాట్లాడుతూ  పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు లేవ‌న్నారు. అందులోనూ పార్టీల‌కు అతీతంగా జ‌రిగే ఎన్నిక‌ల‌న్నారు. ఏపీలో క‌రోనా ఉధృతి తగ్గింద‌ని, 10 వేల నుంచి 753కు కేసుల సంఖ్య త‌గ్గింద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించ‌డాన్ని ప్ర‌త్యేకంగా గుర్తు పెట్టుకోవాలి.

ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని అనుకోవడానికి గ‌ల కార‌ణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. రాజ్యాంగపరమైన అవసరంతో పాటు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు త‌ప్ప‌క నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని ఆయ‌న గుర్తు చేశారు.

నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేశ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు.  కావున ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం, రాజ‌కీయ ప‌క్షాలు, అధికారులు త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని నిమ్మ‌గ‌డ్డ సూచించారు. 

మ‌రి నిమ్మ‌గ‌డ్డ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వం, ఎస్ఈసీ మ‌ధ్య‌ పంచాయితీకి దారి తీస్తుందా?  లేక సాఫీగా సాగిపోతుందా? అనేది ప్ర‌భుత్వ స్పంద‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం