ఏడేళ్ల క్రితం నిర్భయపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులకు చివరి గడియలు సమీపించాయి. నలుగురు దోషులకు ఫిబ్రవరి ఒకటిన తీహర్ జైల్లో ఉరి తీయనున్నారు. దిశ దోషులకు తెలంగాణ సర్కార్ ఎన్‌కౌంటర్ చేసి శిక్ష విధించిందని, కానీ నిర్భయ దోషులకు ఏడేళ్లు గడుస్తున్నా జాప్యం అవుతుండటంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉంది. అయితే క్షమాభిక్ష కోసం అభ్యర్థించడంతో కొన్ని రోజులు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. దోషుల్లో ముఖేష్ అనే వ్యక్తి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనతో మిగిలిన ముగ్గురికి కాస్తా కలిసొచ్చింది. ముఖేష్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడం, ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో వారికి ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని న్యాయస్థానం నిర్ణయించి సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో ఉరిశిక్ష దగ్గర పడుతున్న పరిస్థితుల్లో చివరి కోరిక ఏమిటో చెప్పాలని దోషులను జైలు అధికారులు అడిగారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను కలుసుకోవాలనుకోవడం లేదా తమ పేరుతో ఉన్న ఆస్తులను ఇష్టమైన వారికి రాసివ్వడంపై దోషులను అడిగినట్టు తీహర్ జైలు అధికారులు తెలిపారు.
కానీ వారు ఏ ఒక్క విషయానికి నోరు మెదపలేదని చెప్పారు. ప్రధానంగా దోషులు ఇప్పటికీ తమకు ఉరిశిక్ష రద్దు అవుతుందని ధీమాతో ఉన్నట్టు జైలు అధికారులు ఆశ్చర్యంతో చెప్పారు. శిక్షపై వారికి ఎంత “నిర్భయ”మో కదా!