నేను బ‌తికే ఉన్నాః జాతీయ స్థాయి రెజ్ల‌ర్‌

తన‌ను కాల్చి చంపార‌నే వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని, బ‌తికే ఉన్నాన‌ని జాతీయ‌స్థాయి రెజ్ల‌ర్ నిషా ద‌హియా చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్ కాంస్య ప‌త‌క విజేత‌, జాతీయ స్థాయి రెజ్ల‌ర్ నిషా…

తన‌ను కాల్చి చంపార‌నే వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని, బ‌తికే ఉన్నాన‌ని జాతీయ‌స్థాయి రెజ్ల‌ర్ నిషా ద‌హియా చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్ కాంస్య ప‌త‌క విజేత‌, జాతీయ స్థాయి రెజ్ల‌ర్ నిషా ద‌హియాతో పాటు ఆమె సోద‌రుడిని దుండ‌గులు కాల్చి చంపిన‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. 

ఈ నేప‌థ్యంలో ఆమె ట్విట‌ర్ వేదిక‌గా త‌న హ‌త్య వార్త‌ను ఆమె ఖండించారు. హర్యానా సోనెపట్‌లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపార‌నే వార్త‌లు క్రీడాలోకాన్ని నివ్వెర‌ప‌రిచాయి. 

తీవ్రంగా గాయపడిన నిషా తల్లి ధన్‌పాటి రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, నిషా దహియా, ఆమె సోదరుడి మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం పంపార‌ని ప్ర‌చారం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ వార్తపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్ప‌ష్టం చేశారామె.  '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్‌ న్యూస్‌.. ఆ వార్త నమ్మకండి'' అంటూ ఆమె ట్విట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో క్రీడాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌సారం చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.