మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ విషయంలో మరోసారి చుక్కెదురైంది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు జైలు జీవితం కొనసాగక తప్పని స్థితి. మంత్రిగా అచ్చెన్నా యుడు ఈఎస్ఐలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని, మందులు, ఇతరత్రా కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఏపీ సర్కార్కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఎం నేత ఫిర్యాదుతో ఈఎస్ఐ కుంభకోణం డొంక కదిలింది. దానిపై ఏపీ సర్కార్ చేపట్టిన విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. దాదాపు రూ.150 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్రను దర్యాప్తు బృందం గుర్తించింది. దీంతో 45 రోజుల క్రితం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెయిల్ కోసం గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా హైకోర్టులో కూడా అచ్చెన్నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది. అచ్చెన్నాయుడుతో పాటు ఇదే కేసులో అరెస్టయిన రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో బెయిల్ కోసం మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు.