యూపీ పోరు.. ఎస్పీ గెలుపు కోసం కాంగ్రెస్ ప్ర‌య‌త్నం!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న అతి ధోర‌ణిని త‌గ్గించేసుకున్న వైనం స్ప‌ష్టం అవుతోంది. ఇది వ‌ర‌కూ వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల‌ప్పుడు స్థానిక పార్టీలతో క‌లిసి బీజేపీని ఓడించ‌డానికి జ‌త క‌లిసినా,…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న అతి ధోర‌ణిని త‌గ్గించేసుకున్న వైనం స్ప‌ష్టం అవుతోంది. ఇది వ‌ర‌కూ వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల‌ప్పుడు స్థానిక పార్టీలతో క‌లిసి బీజేపీని ఓడించ‌డానికి జ‌త క‌లిసినా, త‌న స్థాయి క‌న్నా ఎక్కువ సీట్ల‌ను తీసుకుని ఆ ప్రాంతీయ పార్టీని కూడా దెబ్బ‌తీసింది కాంగ్రెస్ పార్టీ. బిహార్, త‌మిళ‌నాడు వంటి చోట్ల ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు గౌర‌వాన్ని ఇచ్చాయి. అయితే అది చాల‌ని కాంగ్రెస్ పార్టీ సీట్ల‌ను కూడా తీసుకుని వీలైనంత‌గా ఓట‌మి పాలైంది. 

ఆశ‌లావు పీక స‌న్నం అన్న‌ట్టుగా సాగింది అక్క‌డ కాంగ్రెస్ ధోర‌ణి. క‌ట్ చేస్తే.. యూపీలో అఖిలేష్ యాద‌వ్ ముందుగానే కాంగ్రెస్ ను ప‌క్క‌న పెట్టాడు. క్రితం సారి వంద సీట్ల‌ను కాంగ్రెస్ కు కేటాయిస్తే ఏం చేసిందో అంద‌రికీ తెలిసిందే. కాంగ్రెస్ ను ఎక్కువ‌గా ఊహించుకుని అఖిలేష్ మ‌రింత‌గా చిత్త‌య్యాడ‌ప్పుడు. అయితే ఈ సారి కాంగ్రెస్ తో పొత్తు ఆలోచ‌నే చేయ‌లేదు. ఎయిర్ పోర్టులో ఎక్క‌డో ప్రియాంక ఎదురైతే.. విష్ చేశాడు తప్ప‌, కాంగ్రెస్ తో పొత్తు ఊహాగానానికి కూడా తెర‌లేవ‌నీయ‌లేదు.

ఇక కాంగ్రెస్ కూడా స‌మాజ్ వాదీ పై ఏమీ శాప‌నార్థాలు పెట్ట‌లేదు. పొత్తుకు రాలేద‌ని తిట్ట‌లేదు. యూపీ అసెంబ్లీ పోరును కాంగ్రెస్ సీరియ‌స్ గా తీసుకుంటుంద‌ని, ప్రియాంక సీఎం క్యాండిడేట్ గా రంగంలోకి దిగుతుందంటూ మొద‌ట్లో జ‌రిగిన ప్ర‌చారాన్ని కాంగ్రెస్సే టోన్ డౌన్ చేసింది. అలాంటి ఉద్దేశం లేద‌ని ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. 

ఇప్పుడు యూపీ పోటీలో కాంగ్రెస్ అయితే ఉంది, అయితే .. ఆ పార్టీ అజెండా ఏమిటో సూఛాయ‌గా ఇచ్చేసింది. ఎస్పీ ప్ర‌ముఖులు పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డం లేదు! అఖిలేష్ యాద‌వ్, శివ‌పాల్ యాద‌వ్ వంటి వారిపై త‌మ అభ్య‌ర్థులు ఉండ‌ర‌ని యూపీ కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. వారి విజ‌యాల‌కు తాము ఏ ర‌క‌మైన ఆటంకాలూ పెట్ట‌మ‌ని త‌ద్వారా స్ప‌ష్టం చేసింది. త‌ద్వారా త‌మ పార్టీ శ్రేణుల‌కు కూడా స్ప‌ష్ట‌త ఇచ్చింది. ప్ర‌స్తుతానికి బీజేపీని ఓడిస్తే చాలు, మిగ‌తాదంతా వేరే క‌థ అన్న‌ట్టుగా కాంగ్రెస్ పార్టీ స‌మాజ్ వాదీ పార్టీకి త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించుకుండానే ప్ర‌క‌టించిన‌ట్టైంది.

యూపీలో కాంగ్రెస్ కు సాలిడ్ గా ఐదారు శాతం ఓటు బ్యాంకు స్థిరంగా కొన‌సాగుతూ ఉంది. యూపీ పోల్స్ ను కాంగ్రెస్ మ‌రింత లైట్ తీసుకుంటున్న వైనాన్ని బ‌ట్టి చూస్తూ.. త‌ను మ‌రింత నిస్తేజంగా మారి ఎస్పీకి సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌లిగించే వ్యూహాన్ని ఫాలో అవుతున్న‌ట్టుగా ఉంది.