ఆ జిల్లాల పేరు చెబితేనే వణుకు

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఆ జిల్లాలో ఉన్న వారికి స్నేహితులు, బంధువుల నుంచి ఒకటే ఫోన్లు. మీ జిల్లాలో కరోనా ఉందంట కదా జాగ్రత్త.. బయటికెళ్లకు…

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఆ జిల్లాలో ఉన్న వారికి స్నేహితులు, బంధువుల నుంచి ఒకటే ఫోన్లు. మీ జిల్లాలో కరోనా ఉందంట కదా జాగ్రత్త.. బయటికెళ్లకు అని. ఆ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా కరోనా విజృంభించడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమయ్యారు. విజయనగరం, శ్రీకాకుళం మాత్రం కరోనా కాటుకి దూరంగా ఉన్నాయి. ఇక గుంటూరు, కర్నూలు జిల్లాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల వాటా దాదాపుగా 50శాతం ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆ రెండు జిల్లాల్లో ఆస్పత్రుల నుంచి ఎవరూ కరోనా వ్యాధి నయమై డిశ్చార్జ్ అవ్వలేదు. అవును.. గుంటూరు జిల్లాలో డిశ్చార్జి కేసులు సున్నా, మరణాలు-4. కర్నూలులో కూడా డిశ్చార్జిలు-0, మరణాలు 2.

కడప, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో పదుల సంఖ్యలో రోగులు వ్యాధి నయమై ఇంటికి వెళ్తుంటే.. కర్నూలు, గుంటూరులో మాత్రం వచ్చినవారు వచ్చినట్టే ఐసోలేషన్లో మగ్గిపోతున్నారు. మరణాలు ఉంటున్నాయి తప్ప డిశ్చార్జీలు జరగడం లేదు. అసలు ఆ రెండు జిల్లాల్లో ఏం జరుగుతోందనేది ఇప్పుడు అందర్నీ తొలిచివేస్తున్న వ్రశ్న.

తబ్లిగీ వ్యవహారం జరిగినప్పటి నుంచి కర్నూలులో కేసులు విపరీతంగా పెరిగాయి, గుంటూరు విషయంలో సరైన కారణాలు తెలియకపోయినా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా ఇక్కడ కూడా తబ్లిగీ వ్యవహరామే. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి బైట ప్రాంతాలకు వలస వచ్చిన కూలీలు, ఇతర పనుల మీద బైటకొచ్చినవారు సొంత ప్రాంతాలకు పోవడానికి వణికిపోతున్నారు. గుంటూరు, కర్నూలు పేరు చెబితేనే పక్క జిల్లాలవారు హడలిపోతున్నారు.

చెక్ పోస్ట్ ల వద్ద పోలీస్ బలగాలు మోహరించి ఏ ఒక్కరినీ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు పోకుండా పహారా కాస్తున్నాయి. రెడ్ జోన్ల కంటే మించిన డేంజర్ జోన్లో ఉన్న గంటూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి ఇప్పుడప్పుడే కుదుటపడేలా లేదు. మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే కేసుల సంఖ్యలో పెరుగుదల 50శాతం అధికంగా కనిపిస్తోంది. కరోనా కంట్రోల్ లోకి వచ్చినా కూడా ఆ రెండు జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టేలా ఉందని స్వయంగా అధికారులే చెబుతున్నారు.

ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈ రెండు జిల్లాలపైనే ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. కరోనా టెస్ట్ కిట్ల సరఫరాలో కూడా ఈ రెండు జిల్లాలకే ప్రాముఖ్యతనిచ్చారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల రాకతో పరీక్షల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ రెండు జిల్లాల నుంచి ఇంకెన్ని పాజిటివ్ కేసులు వినాల్సి వస్తుందా అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.

ఎన్ కౌంటర్ విత్ కరోనా