ఇన్నాళ్లూ ఉండింది హైదరాబాద్ లోనే.. విద్యా, ఉద్యోగం కోసం హైదరాబాద్ లో ఉన్న వాళ్లే అంతా. అప్పుడంతా అవసరం. ఇప్పుడు బయట అంతా బోసిపోయే సరికి సొంతూరి మీదికి గాలి మళ్లింది. ఒకటీ రెండు రోజులు అక్కడ తమ తమ ఇళ్లల్లో గడిపేసరికే బోర్ కొట్టేసింది. అర్జెంటుగా ఆంధ్రా వెళ్లిపోవాలి, సొంతూరికి వెళ్లిపోవాలి!
అసలు పరిస్థితి ఏమిటనేది ఈ జనాలకు అర్థం అవుతోందా? తాము ఒక మహమ్మారిని ఎదుర్కొంటున్నట్టుగా అర్థం కావట్లేదా? హైదరాబాద్ నుంచి అర్జెంటుగా సొంతూరు వెళ్లిపోవడానికి ఇవేమైనా వేసవి సెలవులా? ఏదో వెకేషన్ కోసం వెళ్లినట్టుగా, సంక్రాంతి సెలవుల్లో టోల్ గేట్ల వద్ద క్యూలు కట్టినట్టుగా.. ఏ దండయాత్ర ఏమిటో!
ఎక్కడి వారు అక్కడ ఉండమని స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు. అయితే వీళ్లంతా పని చేసే ఊళ్లలో బోర్ కొట్టేసినట్టుగా, సొంతూళ్లకు జర్నీ మొదలుపెట్టారు. మరి సొంతూళ్లో కాస్త బోర్ కొడితే? షటిల్ సర్వీస్ చేస్తారా? ఇక తెలంగాణ పోలీసుల వద్ద తెచ్చుకున్న కామెడీలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో ఊరూ పేరు లేకుండా ఎన్ఓసీ అంటూ పోలీసుల నుంచి తెచ్చుకున్న ఆమోదముద్రలున్నాయి.
సొంతూళ్ల మీద ఎవరికైనా అభిమానం ఉంటుంది. దాన్ని ఎవరూ తప్పు పట్టలేం. అయితే… ఇప్పుడు సొంతూళ్లకు వెళ్లి సేదతీరే పరిస్థితులు కావు ఇవి. మరో పక్షం రోజులు గడిస్తే.. కరోనా ఫియర్స్ తగ్గితే.. ఎలాగూ అప్పటికి సమ్మర్ హాలిడేసే. అంతా బాగుంటే అప్పుడు ఎవరికి తోచిన చోటకు వారు తిరగవచ్చు. అంత వరకూ కాస్త ఉగ్గపట్టుకుంటే అందరికీ మంచిది. ఎక్కడి వారు అక్కడ ఉండమంటే.. రాజకీయ విమర్శలు చేసేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఏపీ డీజీపీ స్పష్టమైన ప్రకటన చేశారు. ఆంధ్రాలోకి ఎవరికీ ఎంట్రీ లేదని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన తేల్చి చెప్పారు.
ఇక ఈ విషయంలో తెలుగుదేశం వాళ్లు రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టారు. ఆంధ్ర వాళ్లను ఆంధ్రాలోకి రానీయరా, అలాగైతే విదేశాల నుంచి తెలుగు వాళ్లను ఎందుకు రప్పించారు? అంటూ వారు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఎప్పుడూ ఉండే వాళ్లను ఇప్పుడు అక్కడే ఉండమని అనడానికి, ఎక్కడో విదేశంలో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యన ఉన్నవారిని స్వదేశానికి రప్పించడానికి తెలుగుదేశం పెడుతున్న పోలిక.. ఆ పార్టీ రాజకీయ పతనావస్థకు నిదర్శనంగా ఉంది.