చేతిలో చిల్లిగవ్వ లేని జగన్ ప్రభుత్వ ఆశలు, ఆశయాలు మాత్రం చేంతాడంత. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్న సొమ్ము అక్షరాలా రూ.100 కోట్లు మాత్రమే. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక కష్టాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో జగన్‌కు బాగా తెలుసు. అయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం ఎంత అప్పు చేయడానికైనా జగన్ ప్రభుత్వం వెనుకాడడం లేదు.
ఒక వైపు ఏపీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతోందనే ఆందోళనలు వెల్లువెత్తుతుంటే, మరో వైపు ఆదాయ మార్గాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. ఇది వైసీపీ ఎన్నికల హామీ కూడా. ఈ నేపథ్యంలో వైసీపీ పార్లమెంట్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రస్తావించడం గమనార్హం.
కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వస్తాయని జగన్ ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు గత ఏడాదే ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీకి సిద్ధమైంది. ఈ మేరకు సీఎంవో ఆదేశాలతో కింది స్థాయి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఆ విషయమే మరుగున పడింది. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తుందంటూ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ మాత్రం చేయూతనిస్తున్నదో అందరికీ తెలుసు.
అలాంటిది కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని కొత్త జిల్లాల ఏర్పాటు వైపు అడుగు ముందుకేస్తే మాత్రం… జగన్ ప్రభుత్వం ప్రమాదంలో పడక తప్పదని ఆర్థిక, రాజకీయ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలే ఆర్థిక వనరులు లేని ఏపీ ప్రభుత్వం కొత్త వాటిపై దృష్టి పెడితే మాత్రం సమస్యల్ని కొని తెచ్చుకోవడం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా డిమాండ్ లేని అంశాలపై కంటే, ప్రజానీకం సతమతం అవుతున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పౌర సమాజం హితవు చెబుతోంది.