చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆసక్తిదాయకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో భాగమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లకు అక్కడ పోలింగ్ జరగడం లేదు. మొత్తం అన్ని స్థానాలూ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో.. పోలింగ్ అవసరం లేకుండా అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యింది.
మొత్తం 72 ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. వాటన్నింటిలోనూ కేవలం ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే మిగిలాయి. నామినేషన్లు దాఖలు అయినప్పుడు కొన్ని సీట్లకు ఒకటికి మించి నామినేషన్లు దాఖలు అయినా, ఉపసంహరణ ఘట్టం నాటికి.. అన్ని సీట్లలోనూ ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలిందట. దీంతో అన్ని సీట్ల ఎన్నికా ఏకగ్రీవంగా పూర్తి అయ్యింది.
ఈ 72 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 71 సీట్లను సొంతం చేసుకోగా, ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గాడు. ఇక ఇదే నియోజకవర్గంలో జడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఆరు జడ్పీ సీట్లనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ఇలా మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన నియోజకవర్గంగా తంబళ్లపల్లె నిలుస్తూ ఉంది.