గవర్నర్ కూడా కేసీఆర్ కు టార్గెటెనా?

తెలంగాణలో ఇప్పుడు మరో విషయం చర్చనీయాంశమైంది. ఈమధ్య ఇక్రిశాట్ కార్యక్రమంలో పాల్గొనడానికి, ముచ్చింతల్ లో రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలకడానికి వెళ్ళలేదు. ముచ్చింతల్లో జరిగింది ప్రైవేటు కార్యక్రమం…

తెలంగాణలో ఇప్పుడు మరో విషయం చర్చనీయాంశమైంది. ఈమధ్య ఇక్రిశాట్ కార్యక్రమంలో పాల్గొనడానికి, ముచ్చింతల్ లో రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలకడానికి వెళ్ళలేదు. ముచ్చింతల్లో జరిగింది ప్రైవేటు కార్యక్రమం కాబట్టి దానికి కేసీఆర్ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని మంత్రులు చెప్పుకున్నారు. అంటే కేసీఆర్ చేసింది కరెక్టే అని వారి అభిప్రాయమన్నమాట.

మరి ఇక్రిశాట్ ప్రభుత్వ సంస్థ. అందులో జరిగింది అధికారిక కార్యక్రమమే కదా. ప్రధాని మోడీ ముందుగా అటెండ్ అయింది ఆ కార్యాక్రమానికి కదా. మరి ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ స్వాగతం పలకాలి కదా. కానీ ఆ పని చేయలేదు. మంత్రులు ఆ విషయం ప్రస్తావించకుండా ముచ్చింతల్ కార్యక్రమం గురించి మాత్రమే చెప్పి కేసీఆర్ స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నిన్న మేడారం జాతర ముగింపు సందర్భంగా గవర్నర్ తమిళసై అక్కడికి వెళ్లారు.

కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి గురించి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో మాట్లాడటానికి ముంబై వెళ్లే పనిలో బిజీగా ఉండి మేడారం పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఇక్కడ విషయమేమిటంటే ….మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకాలి. కానీ వాళ్ళెవరూ ఆ పని చేయలేదు. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరురాలు కాబట్టి ప్రోటోకాల్ పాటించాలి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముచ్చింతల్ కు వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లి స్వాగతం పలికారు.

రాష్ట్రపతి వచ్చింది అధికారిక కార్యక్రమానికి కాదు. ప్రైవేటు కార్యక్రమానికి. మోడీకి స్వాగతం పలకని కేసీఆర్ రాష్ట్రపతికి ఎలా స్వాగతం పలికారు. కేసీఆర్ కొన్నాళ్లుగా మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు కాబట్టి మోడీకి మొహం చూపించే ధైర్యం లేక జ్వరం వచ్చిందనే కారణంతో వెళ్లలేదనే విమర్శలు వచ్చాయి. ఆ తరువాత ప్రెస్ మీట్లో ఇంట్లో ఇద్దరికీ కరోనా వచ్చినందువల్ల వెళ్లలేకపోయానన్నారు.

దీన్నిబట్టి రాజకీయ వైరం కారణంగానే కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని అర్ధమవుతోంది. ఇక గవర్నర్ విషయంలోనూ ప్రోటోకాల్ పాటించలేదు. మరి ఆమె అటెండ్ అయింది కూడా ప్రైవేటు కార్యక్రమమే (టీఆర్ఎస్ భాషలో) కదా. దేశానికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పుడు రాష్ట్రానికి ప్రథమ పౌరురాలైన గవర్నర్ కు కూడా స్వాగతం పలకాలి. ఆమెకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పి ఉంటారా? రాజకీయ కారణాలతో మంత్రులు పోకపోయి ఉండొచ్చు.

కానీ ప్రభుత్వ అధికారులైన జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి ఏమైంది? ఇప్పటి సివిల్ సర్వీస్ అధికారులంతా రాజకీయ నాయకులకు దాసోహం అంటున్నారు కదా. వీరు కూడా అలా అన్నారేమో. గవర్నర్ కు స్వాగతం పలుకకపోవడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. గవర్నర్ తమిళసై బీజేపీ మనిషి.

గతంలో బీజేపీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్న మనిషి. ఇదివరకు ఉన్న గవర్నర్ నరసింహన్ మాదిరిగా జీ హుజూర్ అనకుండా అప్పుడప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాల్లో సీఎంను ఇబ్బంది పెడుతున్నారు. ఇది కూడా కేసీఆర్ మనసులో ఉండొచ్చు. అందుకే ప్రోటోకాల్ పాటించి ఉండకపోవొచ్చేమో!