జనం నాడిని పసిగట్టడం రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్లుగా రాజకీయ నాయకులు ఒకటనుకుంటే జనం మరొకటి అనుకుంటారు. ఫలానా విధంగా వ్యవహరిస్తే రాజకీయ లబ్ది పొందొచ్చునని రాజకీయ నాయకులు అనుకుంటారు. కానీ అది వర్కవుట్ కాకపోవొచ్చు.
ఒక్కోసారి నాయకుల ప్రమేయం లేకుండా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని అనుకుంటారు. వాటిని జనం పట్టించుకోకపోవచ్చు. తాను ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయాడు. అంటే 2024 లో ఎన్నికల వరకు బాబు సభలో అడుగుపెట్టడు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యకు అసెంబ్లీలో అవమానం జరిగిందని భోరున విలపించిన సంగతి తెలిసిందేకదా.
బాబు విలపించిన ఘటనకు టీడీపీ అనుకూల మీడియా బాగా ప్రచారం కల్పించింది. చంద్రబాబు మీద ప్రజలకు సానుభూతి కలిగే విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీకెండ్ వ్యాసం కొత్త పలుకు రాశాడు. ఎలాంటి ముందస్తు రాజకీయ ప్లాన్ లేకుండా చంద్రబాబు విలపించి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టలేం. ఇప్పుడు దాన్ని రాజకీయ లబ్ది కోసం ఎలా ఉపయోగించుకోవాలన్నదే టీడీపీ ప్లాన్.
చంద్రబాబు ఏడుపు గురించి కొన్నాళ్లపాటు చర్చను సాగదీస్తారు. చంద్రబాబు విలపించిన ఘటనపై ప్రజల్లో సానుభూతి వస్తుందని, వైసీపీ నీచ రాజకీయాలను ప్రజలు ఏవగించుకొని బాబుకు అధికారం అప్పగిస్తారని టీడీపీ నాయకులు భావిస్తుండవచ్చు. బాబుకు కూడా వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం ఉన్నట్లుంది. అందుకే తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని అన్నాడు.
ఇక్కడ ఇంకో సందేహం వస్తోంది. తాను సీఎంగానే సభలో అడుగుపెడతానని బాబు అన్నాడు కదా. ఒకవేళ బాబు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఆయన సభలో అడుగు పెట్టాడా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ? తన అంచనా తప్పిపోతే బాబు ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే … నాయకుల అంచనాలను ప్రజలు తలకిందులు చేయొచ్చు.
గతంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడిపై ఇప్పటి మావోయిస్టు, అప్పటి పీపుల్స్‌వార్ బాంబు దాడి చేసింది. నిజంగా అది దారుణ ఘటనే. చంద్రబాబు కొద్దిలో తప్పించుకున్నాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఈ ఘటన జరిగింది సమైక్య రాష్ట్రంలో.
అప్పట్లో 23 జిల్లాల్లోనూ చంద్రబాబు నాయుడు చొక్కాపై రక్తపు మరకలున్న నిలువెత్తు పోస్టర్లతో ప్రచారం చేశారు తెలుగు తమ్ముళ్లు. ఇది తమకు చాలా లాభం చేకూరుస్తుందని చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్లంతా ఆశించారు. కాని, ఎన్నికల ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి.
ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బాంబు దాడిని సరైన సమయంలో వాడుకోలేకపోయామని, ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల ఆనాడు సింపతీ రాలేదని తెలుగుదేశం పార్టీ భావించింది. 2003 సంవత్సరం అక్టోబర్ నెలలో చంద్రబాబు నాయుడిపై నక్సలైట్లు దాడి చేశారు. ఆ తర్వాత 2004 లో ఎన్నికలు జరిగాయి. బాంబు దాడి ఘటనను ప్రజలు పట్టించుకోలేదు.
చంద్రబాబు నాయుడి పట్ల సానుభూతి చూపించలేదు. పైగా అత్యధిక మెజార్టీతో వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంతవరకూ 180 స్థానాలున్న తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 47 స్థానాలకు పడిపోయింది. రక్తపు మరకలున్న చంద్రబాబు నాయుడిపై కొన్ని నెలలు కూడా సానుభూతిని చూపించలేకపోయారు తెలుగు ఓటర్లు.
ప్రాణాలు పోయే ఘటననే ప్రజలు పట్టించుకోలేదంటే, ఇప్పుడు బాబు కన్నీళ్లను ప్రజలు పట్టించుకుంటారా ? అందులోనూ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళకు పైగా సమయముంది. ఒకవేళ ఆ ఎన్నికల్లో బాబు అధికారంలోకి వస్తే అందుకు కారణం బాబు కన్నీళ్లు కావు. జగన్ వైఫల్యాలే అవుతాయి. ఇప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఏడుపులు ప్రజలకు గుర్తుండవు. తాము ఆశించిన పాలన అధికారంలో ఉన్నవారు అందించారా లేదా అని మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. దాని ప్రకారమే తీర్పు ఇస్తారు.