ఒకవేళ కాంగ్రెస్ వాళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే.. ఇలాంటి హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చేతగాని తనం వల్ల అనేసేందుకు వీలుండేది. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ భారీ ఆధిక్యతతో కూడిన అధికారంతో ఉంది కాబట్టి, ఒకవేళ కశ్మీర్ లో తమకు కాని ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే.. అబ్బే, ఆ ప్రభుత్వం పాకిస్తాన్ ఏజెంట్ గా పని చేస్తోందని బురదజల్లేసేందుకూ ఛాన్సు ఉండేది.
కేంద్రంలో అధికారమేమో కమలం చేతిలో ఉంది, కశ్మీర్ లోనేమో రాష్ట్రపతి పాలన సాగుతూ ఉంది.. అయితే అక్కడ అల్లకల్లోలం మాత్రం ఆగడం లేదు! ఇప్పుడు ఎవరిని నిందించాలో అర్థం కాని స్థితిలో ఉన్నట్టున్నారు భక్తులు. సింపుల్ గా నెహ్రూను నిందించడం మాత్రమే ఈజీలాగుంది.
గత రెండు వారాల్లో ఐదు మంది బిహారీలను పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. కశ్మీర్ లో పనుల కోసం వెళ్లిన బిహారీలపై ఉగ్రవాద దాడులు సాగుతున్నాయి. బిహారీలనే కాదు.. నాన్ లోకల్స్ పై ఉగ్రదాడులు. ఇన్నాళ్లూ ఉగ్రదాడులు సైన్యాన్ని లక్ష్యంగా చేసుకునేవి. అయితే ఇప్పుడు డైరెక్టుగా సామాన్యులపై, నాన్ లోకల్స్ పై జరుగుతున్నాయి.
అంతే కాదు.. కశ్మీరీ ఇంకా కొద్దో గొప్పో మిగిలిన పండిట్లు కూడా ఇప్పుడు తీవ్రమైన అభద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారనే మాట వినిపిస్తూ ఉంది. తమ ప్రస్థానంలో ఎన్నడూ లేనంత అభద్రతాభావాన్ని వారు ఎదుర్కొంటున్నారని జాతీయ పత్రికల వార్తా విశ్లేషణల్లో రాస్తున్నారు!
ఆర్టికల్ 370 అయినా ఉండి ఉంటే.. దాని వల్లనే ఉగ్రఆగడాలు అంటూ భక్తులు తేల్చి పడేసేవారు. అదీ లేదూ, ఇదీ లేదు. ఒకవైపు ఢిల్లీ పెద్దలు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తో పక్క దేశాలకు గట్టి హెచ్చరికను జారీ చేశామన్నారు. కానీ కశ్మీర్ లో మాత్రం సామాన్యులు బలవుతున్నారు. పొట్ట కూటి కోసం వెళ్లిన వారు వాళ్లు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో మీరు భూములు కొనొచ్చు, కశ్మీర్ లో అమ్మాయిలను మీరు పెళ్లి చేసుకోవచ్చు.. అంటూ వాట్సాప్ యూనివర్సిటీ అప్పట్లో అదరగొట్టేసింది.
కళ్లలో నీళ్లు పెట్టుకుని ఆనంద భాష్పాలను రాల్చింది. అవన్నీ ఏమో కానీ.. ఇప్పుడు కశ్మీర్ లో స్థానికేతరులు అంటూ కూటి కోసం వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపుతున్నారు. వీటి సంగతేమిటో, దీనికి నెహ్రూ ఏ రకంగా బాధ్యుడో వాట్సాప్ యూనివర్సిటీ కొత్త జ్ఞానబోధను అందుకోవాలిక!