'కోపం.. అసూయ.. అబద్ధాలు.. మోసం.. ఇలాంటి వ్యవహారాలు చేస్తే జీవితం మొత్తం పతనమవుతుంది…' పెందుర్తిలో నూతన్ నాయుడు ఇంటి దగ్గర ఈ తరహా ఫ్లెక్సీలుంటాయట! ఈ జనసేన వీరాభిమాని లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
చీటింగ్ వ్యవహారాలతో నూతన్ నాయుడు జైలుకు వెళ్లారు. ఒక దళిత యువకుడికి తన ఇంట్లో శిరోమండనం చేయించడంతో పాటు, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో అనేక మంది ఫోన్లు చేయడం, కొన్ని కేసుల్లో నిందితులను వదిలేయాలంటూ పోలీసులకు ఫోన్లు చేయడం, ఇతరాత్ర సెటిల్ మెంట్లను చేయప్రయత్నించడంపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ నూతన్ నాయుడు దళిత యువకుడికి శిరోమండనం కేసులో మాత్రమే అరెస్టయ్యాడు.
ఇక ఇతర కేసుల విచారణ మొదలైతే ఇతడి పరిస్థితి ఎలా ఉంటుందో. దళిత యువకుడికి శిరోమండనం చేయించే ముందు ఇతడి భార్య ఇతడికి వీడియో కాల్ చేసిందట. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంలో ఇతడికీ ప్రమేయం ఉందని, ఇతడికి తెలిసే అంతా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. అనే మాటకు తగ్గట్టుగా ఉంది నూతన్ నాయుడి వ్యవహారం. చాలా మంది వివాదాస్పదులను బిగ్ బాస్ హౌస్ పిలుస్తుంటుంది, నూతన్ నాయుడు మాత్రం బిగ్ హౌస్ కు వెళ్లొచ్చాకా వివాదాస్పదుడిగా హైలెట్ అవుతున్నట్టున్నాడు. తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా నిలుస్తున్నాడు.