దేశ సర్వోన్నత న్యాయస్థానం చీఫ్‌గా మన తెలుగు బిడ్డ త్వరలో బాధ్యతలు స్వకరించనున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ పేరుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయన చీఫ్ జస్టిస్ అభ్యర్థిత్వంపై నెలకున్న అనుమానాలకు తెరపడినట్టైంది.
జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నివాసి. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. బోబ్డే తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వీ రమణ సీనియర్.
అయితే ఏపీ రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు విషయంలో జస్టిస్ రమణ జోక్యం చేసుకుంటున్నారంటూ గత ఏడాది చీఫ్ జస్టిస్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కావడంపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే సీఎం జగన్ ఫిర్యాదులో వాస్తవాలు లేవంటూ ఇటీవల చీఫ్ జస్టిస్ కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో తన తర్వాత సీజేగా ఎన్వీ రమణ పేరును ఆయన ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేస్తూ …నేడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన 2022, ఆగస్టు 26వరకు పదవిలో కొనసాగనున్నారు.